Loading Now

ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

నిజ‌మే మీరు చ‌దివింది! ఓటును నోటు త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. అయినా తీసుకుంటే త‌ప్పేంది? ఓహో.. ఐదు యేండ్ల పాల‌న‌కు రూ. 500 తీసుకుంటే రోజుకు రూ. 1 చిల్లెర తీసుకున్న‌ట్లు అంటారా ? లేక గంత మొత్తాన్ని బిక్ష‌గాడు కూడా తీసుకోడు అంటారా? అస‌లు మీ ఉద్దేశం ఏంటి? ఫైస‌లు తీసుకోవ‌డం త‌ప్పా ? లేక త‌క్కువ తీసుకోవ‌ద్ద‌నా..

అవును మీరు చెప్పిన‌ట్లే.. నేను ఒక్క‌రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేస్తా అనుకోండి.. నాకు వ‌చ్చే లాభం ఏంది ? నేను తీసుకోక‌పోతే.. నా మీదే అంద‌రి క‌న్ను ఉంట‌ది. వీడు మ‌న‌కు ఓటు వేయ‌డ‌ని గుర్కాయించి చూస్త‌రు. “జ‌ర అన్న అధికారంలోకి రాని నీ సంగ‌తి చూస్తాం..” అంట‌రు. క‌ర్మకాలి ఆ అన్నే లీడ‌ర్ అయ్యిండ‌నుకో.. ఇగ నా సంగ‌తి ఏంది?

నాకు ఆ ఫ‌ల‌న లీడ‌ర్ తో ఒక ప‌ని ప‌డుత‌ది అనుకోండి. గ‌ప్పుడు ఆ లీడ‌ర్ నా పనుల‌ను చేస్తాడా ? అది ఆయ‌న క‌ర్త‌వ్యం అయినా కానీ న‌న్ను కుక్కను తిప్ప‌న‌ట్లు తింపించుకోకుండా ఉంటాడా జ‌ర‌ చెప్పండి? ఒక‌వేళ ఫైస‌లు తీసుకోకుండా ఆ ఫ‌ల‌న లీడ‌ర్ కే ఓటు వేసాను అనుకోండి.. అప్పుడైనా న‌మ్ముతాడా ? నేను ఇచ్చిన ఫైస‌లే తీసుకోలే .. నాకు ఓటు వేశావంటే న‌మ్ముతానా.. అని అన‌డంటారా?

votefor-note1-copy ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

మ‌న ప‌నికోసం మ‌నం ఎలాగైతే లంచం ఇస్తున్నామో.. వాళ్లు కూడా గ‌ట్ల‌నే వాళ్ల రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఫైస‌లు పంచుతున్నారు దాంట్లో త‌ప్పేంది? “ఎహే.. మేము లంచం ఇచ్చుడేంది. అటూ ఇటూ పోయి మ‌మ్మల్ని క‌లుపుతావేందిరా బాబు అంట‌రా ఏంది?” జ‌ర చెప్తా విన్నుర్రి.. మీరు లంచం ఇచ్చేవాళ్లు ఎలా అవుతారో..

1.దూప‌తో ఉన్న‌ప్పుడు రైల్, బ‌స్ స్టేష‌న్ లో రూ. 20 వాట‌ర్ బాటిల్ ను రూ. 25 అమ్ముతుంటే స‌ప్పుడు చేయ‌కుండా కొంటుంది మీరు కాదా ?
2.అర్జెంట్ గా ఎవ‌రికో కాల్ చేయాల్సి వ‌స్తే.. ఫోన్ లో బ్యాల‌న్స్ లేక‌పోతే.. రిఛార్జీ కోసం షాప్ కు పోగానే.. రూ.50 రూపాయ‌ల టాప్ అప్ కు రూ.60 అన‌గానే గ‌ట్లేట్ల తీసుకుంటావ్ అని వాన్ని గ‌ట్టిగా అర్సుకున్నారా? లేక స‌ప్పుడు చేయ‌కుండా వాడి చేతిలో అడిగినంత ఇచ్చి వ‌స్తున్నారా?
3.ఫ్రీగా ఇవ్వాల్సిన బోనోఫైడ్ , టీసీల‌కు రూ.500 వంద‌లు అడిగితే కామ్ గా ఇచ్చేసింది మీరే క‌దా!
4.క్యాస్ట్, ఇన్ క‌మ్ సర్టిఫికెట్ త్వ‌ర‌గా కావాలంటే ఎవ‌రెవ‌రి చేతులు త‌డ‌పాలో నాకంటే మీకే ఎక్కువ తెలుస‌నుకుంటా..
5.ఇగ మీ తాత ముత్తాత‌లు సంపాధించిన భూమి మీ పేరుకు మారాలంటే.. ఫైస‌లివ్వ‌కుండా ప‌ని చేయించుకుంటున్నారా?

ఇట్లా చెప్పుకుంటూ పోతే.. ఎంత దూరం పోత‌దో మీకు ఎరుకే క‌దా ? దీన్ని లంచం కాదంటారా? మీ ప‌నులు కావ‌డానికి మీరు చెల్లించే ఫీజు అంటారా ఏంది?

ఇలా మీ ప‌నుల కోసం రోజులో ఒక్క‌సారైనా చిన్న మొత్తంలోనైనా లంచం ఇస్తునే ఉన్నారు క‌దా ? ఈ లంచం అనే ప‌దాన్ని మీరు అల‌వాటు చేసిందే క‌దా! .. మీకు లెస్స‌ అల‌వాటు ఉన్న‌దాన్నే మ‌న లీడ‌ర్లు దాన్ని ఫాలో అవుతుండ్రు. గ‌ట్లాంట‌ప్పుడు ఏంది మీ బాధ ? గాళ్లు ఇచ్చే ఫైస‌ల‌తో ఒక్క‌రోజైనా బీరు, బిర్యాని పొట్ల‌ల‌ను తింటాను క‌దా? దాన్ని కూడా తిన‌నివ్వ‌రా ? ఇంకా ఎన్ని దినాలు తినే కూడులో మ‌న్ను పోస్తారు? గందుకే చెప్తున్న‌ ఫైస‌లు తీసుకోవాలే.. మంచిగ చిందులేయాలె.. అన్న‌కు జై కొట్టాలే..

మీకు తెలుస్త‌లేదు.. “నేను ఫైస‌లు తీసుకోకుండా ఓటు వేస్తాను” అని చెప్పినా కానీ.. ఎవ‌డూ నమ్మ‌డు. వాని న‌మ్మ‌కాన్ని నిల‌బెట్ట‌నికే అయినా నేను ఫైస‌లు పుచ్చుకోవాలే. “చ‌దువుకున్నావ్..? గా మాత్రం తెలియ‌దా? ఓటును నోటుకు అమ్ముకుంటున్నావ్.. నువ్వు మ‌నిషివి కావు” అని అంటారా ఏంది? అవును.. నేను మ‌నిషిని కాక‌పోవ‌చ్చు. మ‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కులు కూడా చ‌దువుకున్న వాళ్లే క‌దా.. వాళ్ల‌కు తెలియ‌దా ? నేను చ‌వ‌ట‌నే.. మ‌రి నాయ‌కులు ఏంది ?

votefor-note6 ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

“నేనేమైనా ఫైస‌లు ఇస్తేనే ఓటు వేస్తా..” అంటున్నానా? “వాడు ఇస్తే.. తీసుకుంటా” అంటున్నా.. గ‌ది కూడా త‌ప్పేనా? లేక‌పోతే.. ఫైస‌లు ఇస్తేనే ఓటు వేస్తా.. అంటా అనుకోండి. వాడు నాకు ఫైస‌లు ఎందుకివ్వాలి? అస‌లు రాజ‌కీయాల‌కు మ‌న‌కు మంచి చేయ‌నికే వ‌స్తున్నాడా వాడు? మ‌న‌కోసం వ‌చ్చినోడు ఫైస‌లిచ్చి నాకు ఓటు వేయ‌మ‌ని అడుగుతాడా? కాదు క‌దా! వాడు మింగుడు రాజా కాబ‌ట్టే.. ఫైస‌ల‌తో ఫైర‌వీలు చేస్తుండు. దాన్ని వాడుకోక‌పోతే.. నా అంత లుచ్చ‌గాడు ఇంకెవ్వ‌డూ ఉండ‌డు.

“ఇక ఫైస‌లు పంచినోడు మంచి చేయ‌లేడు” అంటారా? “ఈ రోజుల్లో అస‌లు జ‌నం కోసం, జ‌నం బాగుకోసం ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే వాడు ఉన్నాడా? ఉన్నా కానీ మ‌నం వాళ్ల‌ను గెలిపిస్తున్నామా? లేదుగా.. అలాగే అర‌కొర‌గా నిల‌బ‌డే మంచివాళ్ల‌కు ఓటు వేయాల‌నే ఉంట‌ది కానీ నేను ఒక్క‌న్ని వేస్తే.. వాడేమైనా గెలుస్తాడా ? మ‌న ఓటుకు ఒక వ్యాల్యూవ్ ఉండాలి. గ‌ట్ల గెల‌వ‌నోనికి ఓటు వేసి ఆగం కావొద్దు. నేను ఓటు వేయాల్సి వ‌స్తే.. వాడు గెలిచేవాడైనా ఉండాలె.. లేక నేను వేసినోడైనా గెలవాలి. గప్పుడు కాల‌ర్ ఎగ‌రేసుకుని నేను ఓటు వేసినోడే గెలిచిండురో..” అని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పొచ్చు.

“కానీ గిప్పుడెందుకో నా మ‌న‌సు సంకోచిస్తుంది. నువ్వు త‌ప్పుచేసిన‌ట్లున్నావ్ అంటోంది. ఎవ‌డో లంచాన్ని స్టార్ట్ చేస్తే.. నీ కేమైంది.. లంచం అడిగినోని గువ్వ‌ను గుయ్ మ‌నిపించ‌క స‌ప్పుడు సేయకుండా ఎలా ఉన్నావ్ అని నా మ‌న‌సు చెబుతోంది. ఇలా పోతే.. ఎన్ని రోజులు ఈ లంచగొండి రాజ్యంలో బ‌తుకుతావ్.. ఎదురీదు.. అయితే లంచం ఇవ్వ‌కుండా ప‌నైత‌ది. లేక‌పోతే.. ఎలా ఫైట్ చేయాలో తెలిసొస్త‌ది.” అనిపిస్తుంది.

votefor-note3 ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

“గా రూ. 500 తీసుకున్నందుకే క‌దా.. నేను మ‌రుగుదొడ్డి క‌ట్ట‌కున్నందుకు వ‌చ్చిన ఫైస‌ల్లో రూ.1000 లేపేసిండ్రు. గందుకే క‌దా! ఏ ప‌ని చేయాల‌న్నా..ఫైస‌లు లేనిదే ప‌ని కాద‌ని చెబుతుండ్రు. గా రోజే నేను గీ ఫైస‌లు తీసుకోక‌పోతే.. అంతా మంచిగ‌నే ఉండు కాదా? తీసుకున్నందుకే క‌దా.. ఈ రోజు ఆ నా కొడుకు ఏ లుచ్చ‌ప‌ని చేసినా స‌ప్పుడు కాకుండా ఉంటున్న‌ది. తీసుకున్నందుకే క‌దా.. గ‌ళ్ల‌ప‌ట్టి ప్ర‌శ్నించ‌నిది.”

“అందుకే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన ఫైస‌లు కావాల‌ని అడ‌గ‌ను. ఇస్తే.. తీసుకోకుండా ఉండ‌ను. తీసుకున్నా.. ప్ర‌శ్నించ‌కుండా ఉండ‌ను. అస‌లు ఫైస‌లు ఇచ్చినోనికి ఓటే వేయ‌ను. గ‌ప్పుడే ఫైస‌ల పంచే నాయ‌కులు పోత‌రు. ప్ర‌జ‌ల కోసం పానం ఇచ్చే నాయ‌కులు వ‌స్త‌రు. ఇక ఒక్క ఓటు అంటారా.. మొన్న‌టి దాక నేను కూడా ఆ మంద‌లో గొర్రెనే.. కానీ ఇప్పుడు నేను సింహాన్ని. నాలా సింహాలు పుట్టేవ‌ర‌కు పోరాడుతా.. త్వ‌ర‌గా సింహాలుగా మారేలా చేస్తా..”

viswas-vatte-1019x1024 ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

విశ్వాస్ వట్టె

నల్గొండ(టౌన్),

viswasvatte.1995@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

‘ఆమె’ అలుపెరుగని ఓ శక్తి!

ప్రశ్నించే గళం కావాలె!

మ‌నం మారేదెప్పుడు ?

ప్రేమంటే సంపేసుడేనా ?

Share this content:

You May Have Missed