- ఒక్కరోజే లక్ష మందికి కరోనా
- క్రమంగా పెరుగుతున్నకోవిడ్-19 మరణాలు
- మహారాష్ట్రలో మహమ్మారి పంజా !
- భయాందోళనలో ప్రజలు
దర్వాజ-న్యూఢిల్లీ
దేశంలో కరోనా రక్కసి రంకెలేస్తోంది. అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న యావత్ మానవ సమాజానికి సవాలు విసురుతూ.. తన విజృంభణను కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ.. ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త కేసులతో పాటు మరణాలు సైతం మళ్లీ పెరుగుతుండటం.. భారత్ లో ఒక్కరోజే లక్ష మందికి పైగా కరోనా బారినపడటం దేశంలో వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా సోకింది. ఈ స్థాయిలో దేశంలో ఒకే రోజులో కరోనా కొత్త కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది కోలుకోగా.. 7,41,830 మంది ఇంకా ఆస్పత్రులు, హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
కొత్తగా వైరస్ బారినపడుతున్న వారితో పాటు దేశంలో కరోనా మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా వైరస్‌తో పోరాడుతూ 478 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,65,101 పెరిగింది. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాలు అత్యధికం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అలాగే, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాష్ట్రాలలో వైరస్ ప్రభావం పెరుగుతోంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.
Share this content: