- దేశంలో విజృంభిస్తున్న మహమ్మారి
- తాజాగా 1,29,28,574 కేసులు, 685 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఒక్కరోజే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు సైతం పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,26,789 మందికి కరోనా సోకింది. ఈ స్థాయిలో ఒక్కరోజే కరోనా కేసులు నమోదుకావడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 1,29,28,574కు పెరిగాయి.
ఇక కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో వైరస్ తో పోరాడుతూ 685 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 1,66,862 కు పెరిగింది. కాగా, దేశంలో ప్రస్తుతం 9,10,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 59,258 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,18,51,393కు చేరింది.
9,01,98,673 మందికి అందిన టీకాలు
కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 9,01,98,673 మందికి టీకాలు వేశారు. కాగా, ఇప్పటివరకు దేశంలో మొత్తం 25,26,77,379 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 12,37,781 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
ఈ రాష్ట్రాల్లోనే అధికం..
దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహరాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. యాక్టివ్ కేసులు సైతం అక్కడే అధికంగా ఉన్నాయి. దేశంలో మొత్తం క్రియాశీల కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనే 74.13 శాతం ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఒక్క మహరాష్ట్రలోనే 55.26 శాతం ఉన్నాయి.
https://www.youtube.com/channel/UCw1V7aRQ1TqfGmcy360ezgA
Share this content: