- దేశంలో ఎమర్జెన్సీ తలపిస్తోందంటూ వ్యాఖ్య
- కరోనా నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపండి
- కరోనా నియంత్రణపై సుమోటోగా విచారణలో సుప్రీంకోర్టు
- కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
దర్వాజ-న్యూఢిల్లీ
కరోనా విజృంభణతో దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. దేశంలో కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు.. సంబంధిత ప్రణాళికలు ఏమున్నాయో చెప్పండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు సైతం జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆయా రాష్ట్రాల హైకోర్టులు సుమోటోగా విచారణలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సైతం దేశంలో కరోనా విజృంభణపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటోంది’’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలను సుమోటోగా స్వీకరించింది. కరోనా కట్టడి చర్యలు, కరోనా టీకాలు, ఆక్సిజన్ సరఫరా, కరోనా రోగులకు వైద్య సౌకర్యాలు, బెడ్ల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియలపై ఏదైనా జాతీయ ప్రణాళిక ఉందా అంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
వెంటనే ఆయా పరిస్థితులకు సంబంధించిన ప్రణాళికలు, నివేదికలు అందించాలని ఆదేశించింది. సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై గురువారం విచారణ జరిపింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, కలకత్తా, అలహాబాద్, గుజరాత్ హైకోర్టులు ప్రస్తుతం కరోనా పరిస్థితుల అంశాలపై విచారణ జరుపుతున్నాయనీ, ఇవి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయని ధర్మాసనం తెలిపింది.
ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుతోపాటు లాక్‌డౌన్‌లు విధించుకునే అధికారం రాష్ట్రాలకు వదిలేయాలన్న అంశాలపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ స్పందనలను కోరింది. కరోనా నియంత్రణకు శుక్రవారంలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా నియమించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.