అయ్య బాబో
అడక్కు తినేటోళ్లం
కడుపుమంటనే
సల్లబరచ లేనోల్లం
ఈదికి తాళం నూకినా
ఏ సెట్టుకిందో
ఏ పుట్టసాటో తొంగునేటోళ్లం
ఏలు ఏలు యాడోస్థాయి మాకు
టీకా మందుకూ మాకుకూ?
అందుకే మా యాడదానికి
పట్టుకుంది మాయరోగం
ధర్మాసుపత్రిలో
ధర్మం.లేదు బాబో!
మంచాలు ఏడుండాయ్
అని కసిరినారు
బతిమాలా బామాలా
మంతిరిగారి
సీటీ తెమ్మన్నారు!
ఓటు లేనోల్లం
ఆధారం లేనోల్లం
అసలు జనాభా లెక్కల్లో లేనోల్లం
దరిసనం ఎట్లా ఇస్తాడు ఏ మంతిరైనా
కాళ్ళెట్టుకున్నా
కళ్లెర్ర జేసినా
మండిన నా నోటికీ బూతులొచ్చేసినయ్
చెండి నరసమ్మలు
ఈదిలోకి తోసేసిండ్రు
ఈపు పగలగొట్టిన్రు
యాడదానికి ఊపిరి
ఆడడం లేదు
గిలాగిలా కొట్టుకుంటా
ఆరస్తుండాది రచ్చించమని
అరిసి అరిసి కాళ్ళు
సాపేసింది
భల్లున ఏడ్చినా
కాటికాడికి పోయినా
బుజానేసుకుని శవం
అదే కొచ్చిన్!
మంతిరి సీటీ దెచ్చినావాయని
ఉమ్మేసినా కేకరించి
నడిసినా నడిసినా
ఊరికి దూరంగా
దూరంగా దూరంగా
నా యావిడని
కిందబెట్టి కూకున్నా
గద్దలు వాలాయ్ పీనిగమీన
కాకులు పొడుసుక తింటండాయ్
కుక్కలు సీలుస్తున్నాయ్
నక్కలు నములుతుండాయ్
నాకు మాత్రమే తెలిసిన సోట్ల!
ఎడిసేసినా పెద్దగా
పెద్దగా అరిసేసినా
అదేందో సౌండు రాలేదు
రాలేదప్పనుండీ
మూగబోయింది గొంతు
సచ్చిపోయింది మణుసు
రచయిత: ప్రసాదరావు రామాయణం
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
Share this content: