◘ మొదటి ఐదు స్థానాల్లో సింగపూర్, స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్
◘ ర్యాంకులు వెల్లడించిన ‘ది కామన్‌వెల్త్’ సంస్థ
దర్వాజ-న్యూఢిల్లీ
Global Youth Development Index: గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో భారత్ 122వ స్థానంలో నిలిచింది. మొత్తం ప్రపంచంలోని 181 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ ర్యాంకులు కేటాయించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం, శాంతి, భద్రత, రాజకీయ, పౌర కార్యకలాపాలు సహా మొత్తం 27 అంశాల్లో యువత పాత్ర, అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని ‘ది కామన్‌వెల్త్’ సంస్థ ర్యాంకులతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్, స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్ దేశాలు వరుసగా టాప్`5లో ఉన్నాయి. చాద్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సుడాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్నాయి.
ఈ నివేదికలో ప్రస్తావించిన వివిధ అంశాల వారీగా చూసుకుంటే విద్యలో స్వీడన్, సమానత్వంలో లక్జెంబర్గ్, రాజకీయ, పౌర చైతన్యంలో ఇండోనేషియా, ఉపాధి, ఆరోగ్యం, శాంతి, భద్రత అంశాల్లో సింగపూర్‌లు టాప్‌లో ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్, భారత్, రష్యా, ఇథియోపియా, బుర్కినా ఫాసో దేశాలు ఇదివరకటి కంటే కాస్త పురోగతి కనబర్చిన మొదటి ఐదు దేశాల్లో నిలిచాయి. యువతలో మరణాల రేటు, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య, మద్యపానం, పొగాకు బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది కానీ.. మహిళల భద్రత విషయంలో పురోగతి కఁపించలేదని నివేదికలో వెల్లడైంది.

ఈ నివేదిక తయారీ కోసం 2010-18 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 15-29 ఏండ్ల మధ్యవారిపై అధ్యయనం చేశామని ది కామన్‌వెల్త్ సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో యువత పరిస్థితులు 3.1 శాతం మెరుగుపడినప్పటికీ.. పురోగతి నెమ్మదిగా ఉందని పేర్కొంది. అయితే, ఏకంగా 102 దేశాల్లోని యువత.. రాజకీయాలపై తక్కువ ఆసక్తి కనబర్చుతున్నారనీ, ఇది భవిష్యత్ సమాజాన్ని ప్రభావితం చేయగలదని పేర్కొంది.
గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కోర్ సైతం 3శాతం పెరిగింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు సాధించిన సానుకూల ప్రగతి పై కూడా ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఆయా దేశాలు మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఈ నివేదిక నొక్కి చెప్పింది.