◘ రాణే అత్యవసర పిటిషన్..
◘ ముందు రిజిస్ట్రీ డిపార్టుమెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలన్న కోర్టు
దర్వాజ-ముంబయి
Cabinet Minister N Rane Arrested: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ‘‘ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేండ్లు అయిందో కూడా తెలియదనీ, అలాంటి వ్యక్తి చెంప పగుల కొట్టాలి’’ అంటూ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఆయనను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, మహారాష్ట్రలోని మూడు నగరాల్లో రాణాఫై కేసు నమోదు విషయంలో అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కోరుతూ రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు కొట్టేయాలననీ, తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలనీ, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని రాణే తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ట్రీ డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసుకోవాలనీ, అప్పుడే తాము పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
అరెస్టుకు కారణం ఇదే..
కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం రాయ్‌గఢ్ జిల్లా పర్యటన సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 15న థాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన థాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేండ్లు అయిందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదుకావడం, అరెస్టులు జరిగిపోయాయి. కాగా, క్యాబినెట్లో కొనసాగుతున్న ఓ కేంద్రం మంత్రి అరెస్టు కావడం 20 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి.