దర్వాజ-బెంగళూరు
Gauri Lankesh murder case: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకేసులో సంబంధం ఉన్న 17 మంది నిందితులపై సిటీ కోర్టు అభియోగాలు మోపింది. తదుపరి విచారణ డిసెంబర్ 8న జరగనుంది. అదే రోజున కేసు విచారణ, శిక్షలు వంటి అంశాలు వెల్లడికానున్నాయి. కాగా, ప్రత్యేక దర్వాప్తు బృందం (సిట్) మూడేండ్ల క్రితం ఛార్జి షీట్ దాఖలు చేసినప్పటికీ.. విచారణ ప్రారంభించడానికి అవసరమైన అభియోగాలను రూపొందించడంలో ఆలస్యం చేసే విధంగా నిందితులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిపై అభియోగాలు మోపడంలో ఆలస్యం జరిగింది. అయితే, నిందితుడు మోహన్ నాయక్ పై కర్నాటక కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్-2000ను సుప్రీంకోర్టు సమర్థించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రత్యేక కోర్టు 17 మంది మంది నిందితులపై అభియోగాలు మోపింది.
తాజాగా జరిగిన విచారణలో బెంగళూరు సెంట్రల్ జైలు, పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలు, ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి నిందితులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు. నిందితులు విచారణను కోరారు. ఇక కోర్టు ఆదేశాలు లేకుండా నిందితులను మరో జైలుకు తరలించవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై హత్య, క్రిమినల్, ఆయుధాలు కలిగివుండటం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేయబడ్డాయి. కాగా, పాత్రికేయురాలు గౌరీ లంకేష్ ను 2017 సెప్టెంబర్ 5 రాజేశ్వరి నగర్ లోని ఐడియల్ హోమ్స్ లేఅవుట్ లోని తన ఇంటి వెలుపల హత్య చేసిన సంగతి తెలిసిందే.