• ప్రకృతి ఉసురు తగులుతుంది..
• కాప్26 నేపథ్యంలో గ్రేటా థన్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దర్వాజ-అంతర్జాతీయం
cop26 greta thunberg : ప్రపంచ నాయకులు భవిష్యత్తును సీరియస్‌గా తీసుకున్నట్టు నటిస్తున్నారనీ, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్26 ఈ నవంబర్ 1న ప్రారంభమైంది. 12 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన కాప్ సదస్సులో ప్రపంచ దేశాధినేతలు పర్యావరణాన్ని రక్షించడంలో తీసుకోవాల్సిన చర్యల వాగ్దానాలను గురించి ప్రస్తావించిన థన్‌బెర్గ్.. వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాప్26 సదస్సుకు సమీపంలో గ్లాస్గోలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కేవలం రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వ్యక్తులు మన భవిష్యత్తును సీరియస్‌గా తీసుకున్నట్టు నటిస్తున్నారు అని ఆరోపించారు. ‘‘మార్పు అక్కడ లోపల నుంచి రాదు. (సదస్సు). అది నాయకత్వం కాదు. ఇదే నాయకత్వం’’ అంటూ ప్రపంచ దేశాధినేతలపై విమర్శలు గుప్పించారు. గత మూడు దశాబ్దాల వాగ్దానాలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. ఉద్గారాల తగ్గింపు వాగ్దానాల నేపథ్యంలో సిగ్గు లేకుండా తమను తాము అభినందించుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ విధ్వంసం ఉసురు తగులుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై పాట పాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ఆందోళనకు పిలుపునిచ్చారు.