Breaking
Wed. Dec 4th, 2024

Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

Medaram Jatara
Medaram Jatara

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం చరిత్ర

పురాణాల్లో ఆ ప్రాంతం గురించి ప్ర‌స్థావించ‌లేదు.
గ్రంథాల్లో అక్క‌డి వారి గురించి చ‌ర్చించ‌నూ లేదు.
పేరు మోసిన వంశ‌స్థులు అస‌లేకారు.
రాజ్య‌కాంక్ష ఆక్రమణ ఆశ‌యంగా బ‌తికిన వ్య‌క్తులు కానే కారు.
యుద్ధాల్లో ఆరితేరిన నైపుణ్యాలు అసలే లేవు.

ఇలా.. ఎంత‌ని చెప్పాలి ? ఏమ‌ని చెప్పాలి ? త‌మ‌కంటూ ప్ర‌పంచం గుర్తించే ఏ గొప్ప ల‌క్ష‌ణం లేదు. కానీ వారి గొప్ప‌త‌నాని తెలుసుకోవాలంటే..
స‌ర్వ‌కోటికి ఆశ్ర‌య‌మిచ్చే అడ‌వి త‌ల్లిని అడుగు..
ఎప్పుడు న‌వ్వుతూ క‌నిపించే కొండ కోన‌‌ల‌ను అడుగు..
ఏ పాపం తెలియ‌ని అడ‌వి బిడ్డ‌ల‌ను అడుగు చెప్తారు..
ఒళ్లు విరుచుకుని.. గుండెల్లో నింపుకున్న ఆ రూపం లేని ఆ అమ‌రుల‌ వీర గాథ‌ను.
త‌న జాతి మ‌నుగ‌డ కోసం కాళ్ల బేరానికి పోకుండా తమ‌ ప్రాణాలు ప‌నంగా పెట్టిన వీర వ‌నిత‌ల గురించి. యుద్ధం చేయాలంటే కావాల్సింది క‌త్తులు, క‌టారాలు కాదు..
నా జాతిని కాపాడాల‌న్న అంకిత భావం అని చెప్పే ఆ త‌ల్లుల గురించి మీకు తెలుసా ?

పుస్తకాల్లో పెద్ద‌గా ప్ర‌స్థావ‌న లేని ఆ వీర వ‌నిత‌లు ఎంత గొప్ప ప‌ని చేస్తే.. నేటికి వాళ్ల పేర్లు మారుమోగుతూనే ఉంటాయి ? . వంద‌ల యేళ్ల‌పాటు పాట‌ల రూపంలో, ఆట‌ల రూపంలో మ‌న ముందుకు ఆ త‌ల్లుల ప్ర‌స్థావ‌న వ‌స్తునే ఉంది. అంటే ఏదో పెద్ద రాజ్యాని పాలించి ఉన్నార‌నుకుంటే పొరప‌డిన‌ట్టే.. వారు అడ‌వినే న‌మ్ముకుని.. అడ‌వినే అమ్మాఅయ్య‌గా కొలిచే అడ‌వి బిడ్డ‌ల‌కు అండ‌గా నిలిచిన ధీరులు.

medaram-jathara-2 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

ఆ వీర వ‌నిత‌లు చేసిన ప్రాణ త్యాగానికి గుర్తుగా అడ‌వి పుత్రులు చేసుకునే పండుగే.. మేడారం స‌మ్మ‌క్క, సార‌ల‌మ్మ జాత‌ర‌. ఈ త‌ల్లుల గురించి మీకు, మీ కుటుంబానికి త‌ప్ప‌క తెలియాలి. అమ్మాయిల‌ను త‌క్కువ అంచ‌నా వేసే మూర్ఖుల‌కు మ‌రీ తెలియాలి. అమ్మ మీకు జ‌న్మ నివ్వ‌డానికే కాదు.. అవ‌స‌రం అయితే మీ కోసం, మీ జాతి కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికైనా సిద్ధంగా ఉంటుంద‌ని తెలియాలి.

ఈ విష‌యాలు అర్థం కావాలంటే స‌మ్మ‌క‌, సార‌ల‌మ్మ గురించి తెలుసుకోవాలి. ఈ వీర వ‌నిత‌ల గురించి స‌రైన రాత పూర్వ‌క ఆధారాలు లేక‌పోవ‌డంతో ఎన్నో గాథ‌లు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఆ త‌ల్లుల వీరోచిత‌ పోరాటం గురించి ప్ర‌స్థావిస్తారు. ఆ వీర వ‌నిత‌ల‌ను చూసిన వారి నోళ్ల‌ల్లో నుంచి వ‌చ్చిన మాట‌లు.. ఆ మాట‌లే పాట‌లై వంద‌ల యేళ్లుగా ఆ చ‌రిత్రను ముందు త‌రాల‌కు తెలియ‌జేస్తున్నాయి.

medaram-jathara-5 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

బ‌తుక‌మ్మ పాట‌లో, కోలాటం ఆట‌లో.. ఆ త‌ల్లుల వీర‌త్వం గురించి వింటుంటే.. ఒళ్లు పుల‌క‌రిస్తుంది. ఆ త‌ల్లుల పేరు త‌లిస్తేనే.. చిక్కులు, చింత‌లు పోతాయ‌ని ఎంతో మంది న‌మ్ముతారు. అందుకే.. త‌ల్లీ స‌మ్మ‌క్క నీ గ‌ద్దెకు వ‌స్తాం నా పిల్ల‌ల‌ను స‌ల్లంగా సూడూ అని కొంద‌రు మొక్కితే.. అమ్మా సార‌ల‌మ్మ నాకు పండంటి కొడుకుని ఇవ్వు అని మ‌రికొంద‌రు మొక్కుకుంటారు.

ఇలా వాళ్ల చిక్కులు తీరితే.. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ జాత‌ర‌కు వ‌చ్చి వారి ముడుపుల‌ను చెల్లిస్తుంటారు. అయితే ఈ జాతర ఈ నాటిది కాదు. వంద‌ల ఏళ్లుగా కొన‌సాగున్న మొక్కుల పండుగ‌. ప‌దుల సంఖ్య‌తో షురూ అయిన ఆ జాత‌ర నేడు కోట్ల మంది వ‌చ్చేలా చేసింది. ప్రతీ రెండెళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే ఈ జాత‌ర క‌నుల పండువ‌గా ఉంటుంది. అయితే ఈ జాత‌ర జ‌ర‌గ‌డానికి కార‌ణం మాత్రం తెలుసుకుని తీరాలి. అప్పుడే మ‌న‌కు ఎన్నో విష‌యాలు తెలుస్తాయి.

medaram-jathara-1 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన త‌ర్వాత 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ జాత‌ర‌కు ఇంత గొప్ప ప్రాచుర్యం ఎలా వ‌చ్చింది? ఈ సమ్మక్క, సారలమ్మ ఎవరు ? సంపెంగ వాగు జంప‌న్న వాగు ఎలా అయ్యింది? ఇలాంటి ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకుంటే ఎన్నో విష‌య‌లు తెలుస్తాయి. ఆ చ‌రిత్ర మొత్తం ఇప్పుడు మీ కోసం..

medaram-jathara-7 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

ప‌రిచ‌యం

సమ్మక్క భర్త పేరు పగిడిద్ద రాజు. వాళ్ల‌కు ముగ్గురు సంతానం. వారి పేర్లు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. వారి అల్లుడి పేరు గోవిందరాజు. సమ్మక్క ఆడపడుచు పేరు లక్ష్మీదేవర. ఈ మ‌హా జాత‌ర‌లో వీరంద‌రూ క‌థానాయ‌కులుగా ఉంటారు. వీరంద‌రూ వీరులే. క‌థ‌లో వీరి గురించి చెప్పుకోవ‌ల‌సి వ‌స్తుంది క‌నుక ముందే సంక్షిప్తంగా చెప్పే ప్ర‌య‌త్నం ఇది.

చ‌రిత్ర‌

సమ్మక్మ, సారలమ్మ జాతరకు సంబంధించి ప‌లు క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అన్ని క‌థ‌ల్లో కూడా వారి వీరోచిత పోరాటాన్ని మాత్రం చెబుతుంటారు. ఆ క‌థ‌ల్లో అన్నింటిలో ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య యుద్ధం జరిగింద‌ని ఉంటుంది. కానీ కొన్ని కథల్లో సమ్మక్క మరణించింద‌ని చెబితే.. మ‌రికొన్ని క‌థ‌ల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతాయి.

medaram-jathara-4 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

ఇలా ఎక్కువ‌గా వినిపించే క‌థ‌ను తీసుకుంటే.. ఏడవ శతాబ్దంలో మేడారంలో ఉండే కోయ‌దొర‌లు వేట‌కు అడ‌వికి పోతే.. అక్క‌డ ఒక ప‌సిపాప క‌నిపించింది. ఆ చిట్టిత‌ల్లి దేదీప్యమానంగా వెలిగిపోతు ఉంది. ఆ పాపను వేట‌కు వెళ్లిన కోయదొరలు గుడారానికి తీసుకెళ్లారు. ఆ చిన్న పాప గూడెంకు వ‌చ్చిన అప్ప‌టి నుంచి అక్క‌డి వారికి అంతా మంచే జ‌రిగింది. దాంతో ఆ పాప‌ను అంద‌రు ఎంతో ఆప్యాయంగా చూసేవారు.

కొండ దేవతే పాప రూపంలో త‌మ‌కు దొరికింద‌ని కోయదొరలు న‌మ్మి.. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్కను పెంచిన కోయ చక్రవర్తి పేరు మేడరాజు. పెళ్లివ‌య‌సుకు వ‌చ్చే స‌రికి మేనల్లుడు పగిడిద్ద రాజుతో సమ్మక్కకు పెళ్లి జరిపించాడు. వీళ్ల‌కు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం.

మేడారం పరగణాను పాలించే కోయరాజులు ఓరుగల్లు రాజులకు సామంతులుగా ప‌నిచేసేవారు. ఒక యేడాది ఎంతో క‌రువు కాట‌కాలు వ‌చ్చాయి. దాంతో కోయరాజులు కాకతీయులకు కప్పం చెల్లించ‌లేక‌పోయారు. ఈ విష‌యాన్ని కాక‌తీయ రాజుల‌కు తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వారు విన‌లేదు.

medaram-jathara-9 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

అంతేకాకుండా కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు త‌న‌ సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపించాడు. కాకతీయ సై‌న్యంతో గిరిజ‌నులు వీరోచితంగా పోరాడారు.కానీ వారి ద‌గ్గ‌ర స‌రైన ఆయుధాలు లేక‌పోవ‌డంతో ఎక్కువ‌సేపు నిలువ‌లేక‌పోయారు.ఇలా వీరోచితంగా పోరాడిన యుద్దంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు కూడా వీరమరణం పొందారు.

ఈ పరాజయాన్ని జంప‌న్న తట్టుకోలేక పోయాడు. దాంతో మేడారం సమీపంలోనున్న‌ సంపెంగవాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక క‌థ‌లో తెలుస్తుంది. మ‌రో క‌థ‌లో వీరోచితంగా పోరాడుతున్న జంప‌న్న‌ను సంపెంగ వాగు స‌మీపంలో కాక‌తీయ సేన‌లు హ‌త‌మార్చార‌ని మ‌రో క‌థ‌లో తెలుస్తుంది. జంప‌న్న వీర మ‌ర‌ణం పొందిన వాగు క‌నుకే అప్ప‌టినుంచి ఆ వాగుకు జంప‌న్న వాగు అని పేరు.

ఈ స‌మ‌యంలో సమ్మక్క మహోగ్రరూపిణిగా విజృంభించి కాకతీయ సేనలను అంతం చేయడం షురూ చేసింది. ఇలా కాక‌తీయ సేనాని ఒంటి చేతితో మ‌ట్టుపెడుతున్న సమ్మక్కను ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడిచాడు. ఆ గాయంతోనే సమ్మక్క నెత్తురోడుతూ ఈశాన్యదిశగా ఉన్న చిలుకల గుట్టపైకి వెళ్లి పోయింది. అలా వెళ్లిన ఆమెను అనుస‌రించుకుంటూ కొంద‌రు వెళ్లినా కానీ ఆమె జాడ క‌నిపించ‌లేదు.

medaram-jathara-8 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

కానీ గుట్టమీద నాగవృక్షం ద‌గ్గ‌ర్లో వారికి ఒక కుంకుమ భరిణె దొరికింది. ఆ భరిణెనే వారంతా సమ్మక్కగా భావించారు. ఆమె రాక‌ కోసం ఎన్నో రోజులు అక్కడే నిద్రాహారాలు మాని ఎదురుచూశారు. ఆమె ఎంతకీ తిరిగి రాక‌పోవ‌డంతో కుంకుమ భరిణె లభించిన ప్రాంతంలో రెండు యేండ్ల‌కోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ముత్తయిదువలు పండుగ‌ను జ‌రుపుకునేవారు.

ఈ ముత్త‌యిదువుల పండుగ కాలక్రమేణా జాతరగా మారిపోయింది. అయితే ఈ క‌థ‌లు త‌ప్పిదాల‌ని ఆదివాసీలు చెబుతారు. జంపన్న ఆత్మహత్య చేసుకోలేదంటారు. జంప‌న్న‌ తన నెత్తుటి గాయాలను వాగులో శుభ్రం చేసుకున్నాడు. అందుకే జంప‌న్న వాగు అయ్యింద‌ని చెబుతారు. సమ్మక్క, జంపన్న వంటి కోయవీరులు మరణించ‌లేద‌ని.. వారింకా బతికే ఉన్నారని.. సమ్మక్క భరిణె రూపంలో ప్రతీ రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందని వారు గ‌ట్టిగా న‌మ్ముతారు.

medaram-jathara-11 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

జాత‌ర రెండు యేండ్ల‌కు ఒక‌సారి ఘ‌నంగా జ‌రుగుతుంది.ఈ జాత‌ర నాలుగు రోజుల పాటు జ‌రుగుతుంది.

మొదటి రోజు సారలమ్మ రాక


సమ్మక్క కూతురు సారలమ్మ నివాస గ్రామం కన్నెపల్లి. ఇది మేడారం గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్క‌డ ఒక చిన్న ఆల‌యంలో సారలమ్మ కొలువై ఉంటుంది. అక్క‌డ జాత‌ర స‌మ‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసి.. సారలమ్మను మేడారానికి తీసుకొస్తారు. ఈ దృష్యాన్ని చూసేందుకు దేశ న‌లుముల‌ల నుంచి ఎంతో మంది వ‌స్తుంటారు.

medaram-jathara-3 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

రెండో రోజు సమ్మక్క రాక‌


అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం ప‌లుకుతారు. పూజారులు వనానికి వెళ్లి వెదురుకర్రలు తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. త‌ర్వాత సమ్మక్క పూజా గృహం నుంచి వడ్డెలు పసిడికుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మేడారానికి ఈశాన్యాన చిలుకలగుట్టపై నున్న‌ నారచెట్టు కింద ఉన్న కుంకుమభరిణె రూపంలోని సమ్మక్కను తీసుకొస్తారు. ఈ స‌మ‌యంలో సమ్మక్క రాక కోసం ల‌క్ష‌ల మంది ఎదురు చూస్తారు.

మూడో రోజు దేవతల దర్శనం

సమ్మక్క, సారలమ్మలు మూడోరోజు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల త‌ర్వాత‌ భక్తులు తల్లులను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని కోరుతూ కానుకలు, మొక్కులు చెల్లిస్తారు. నిలువుదోపిడీ ఇస్తారు. తలనీలాలు, తులాభారాలు జరిపిస్తారు. ఆడపడుచులుగా భావించిన తల్లులకు మహిళలు ఒడిబియ్యం పోసి కొలుస్తారు. చీరసారెలు పెట్టి పూజిస్తారు.

12 Medaram Jatara | మేడారం జాతర: సమ్మక్క సారలమ్మల కథ..!

నాలుగో రోజు వనప్రవేశం

సమ్మక్క, సారలమ్మలు నాలుగో రోజున తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. ప‌చ్చ‌ని వ‌నం ఈ జాత‌ర‌తో ప‌ట్నాన్ని త‌ల‌పిస్తుంది. ఎక్క‌డ చూసినా జ‌నంతో నిండిపోతుంది.

Share this content:

Related Post