దర్వాజ-హైదరాబాద్
Chilli prices soar: వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండు మిర్చి రికార్డు స్థాయిలో అధిక ధరకు అమ్ముడుపోవడం రైతుల్లో ఆనందం నింపుతోంది. ఎనుమాముల అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటి.
సింగిల్ పట్టి రకం ( single Patti variety) మిర్చి గరిష్టంగా క్వింటాల్‌కు 40 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఎనుమాముల మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధిక ధరగా చెబుతున్నారు. దేశీ రకం Chilli కూడా అత్యధికంగా క్వింటాల్‌కు రూ.35,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘన్‌పూర్(ములుగు)కు చెందిన బి.రాజేశ్వర్‌రావు సోమవారం మార్కెట్‌కు 40 బస్తాల మిర్చి తీసుకొచ్చి క్వింటాల్ మిర్చి(దేశీ రకం) రూ.35వేలకు విక్రయించారు.
తెగుళ్లు, వైరస్‌లు, అకాల వర్షాల కారణంగా మిర్చి పంటలు దెబ్బతినడంతో మిర్చికి గిరాకీ పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ఈ సీజన్‌లో మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే నమోదవుతున్నట్లు చెబుతున్నారు. దేశీ రకం మిర్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పండిస్తారు.