దర్వాజ-హైదరాబాద్
TRS MLAs poaching case: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు (పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే) కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద నిందితుల్లో ఒకరైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్ సహా మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది.
విచారణకు హాజరుకాకపోతే జైలు శిక్ష తప్పదని సిట్ అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా, నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలకు డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసుపై సిట్ విచారణ కొనసాగుతుండగా, మరోవైపు నందకుమార్ భార్య చిత్ర లేఖ, లాయర్లు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్‌లు శుక్రవారం ఈ కేసుకు సంబంధించి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన రామచంద్ర భారతి, సింహా యాజులుతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
Share this content: