దర్వాజ-అగర్తల
Tripura Assembly Elections 2023:: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో జేపీ నడ్డా మాట్లాడుతూ.. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పండుగలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. త్రిపురలో సుపరిపాలన, అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించడానికి ఓటు కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.
కాగా, 60 అసెంబ్లీ స్థానాల్లో 259 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 28.14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14,15,233 మంది పురుష ఓటర్లు, 13,99,289 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.