దర్వాజ-హైదరాబాద్
Telangana State Finance and Health Minister Harish Rao: గజ్వేల్ పట్టణంలోని కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించి శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అక్కడి క్యాంపు పరిస్థితులను పరిశీలించిన తర్వాత అందుతున్న సేవలు బాగున్నాయని మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందనీ, ఇప్పటివరకు 32 లక్షల మంది పురుషులు, 38 లక్షల మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకోవడంతో 70 లక్షల కంటి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
12 లక్షల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేయగా, ఎనిమిది లక్షల మందికి పంపిణీ చేసేందుకు ప్రిస్క్రిప్షన్ అద్దాలను గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. కంటివెలుగుతో 20 లక్షల మంది కంటి సమస్యలు నయమయ్యాయన్నారు. కష్టపడి పనిచేస్తున్న వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందిని అభినందించిన హరీశ్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు.