దర్వాజ-హైదరాబాద్
YS Vivekananda Reddy murder: మాజీ మంత్రి, వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంశంపై ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వులో ఉంచింది. తుది తీర్పు వచ్చే వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. కాగా, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేపు (మంగళవారం) సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశించాలని అవినాష్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు.
సునీత పిటిషన్ వెనుక సీబీఐ ఉందని, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీమ్ పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయడం లేదని వైఎస్ అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు. అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని విచారణ జరపాలని అవినాష్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసు డైరీని సీల్డ్ కవర్ లో సీబీఐ కోర్టుకు సమర్పించింది. 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, పది డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను కోర్టుకు సమర్పించారు.