దర్వాజ-న్యూఢిల్లీ
Dis’Qualified MP Rahul Gandhi: 2019 పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో లోక్ సభ నుంచి తొలగించిన తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోను ‘అనర్హ ఎంపీ’గా మార్చుకున్నారు. నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది.
‘ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా.. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు | డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోను మార్చుకున్నారు. లోక్ సభ నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లోని గాంధీ విగ్రహాల ముందు ఒక రోజు సత్యాగ్రహం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దేశ రాజధానిలోని రాజ్ ఘాట్ వద్ద ‘సంకల్ప సత్యాగ్రహం’లో పాల్గొంటున్నారు.
పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం, లోక్ సభ నుంచి అనర్హత వేటు వేయడమనేది ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మధ్య సంబంధాలను ఆయన నిరంతరం ప్రశ్నించినందుకు ప్రతిస్పందనగా జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని పేర్కొంది. మార్చి 23న ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో దోషిగా తేలిన నాటి నుంచి రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడనీ పేర్కొంటూ.. లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని తెలిపింది.