సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ మలయాళ న‌టుడు ఇన్నోసెంట్ మృతి

Veteran Malayalam actor, Innocent ,former MP Innocent, film industry, ప్రముఖ మలయాళ నటుడు, ఇన్నోసెంట్, మాజీ ఎంపీ ఇన్నోసెంట్, సినీ పరిశ్రమ,

ద‌ర్వాజ‌-సినిమా

Malayalam actor Innocent Passes Away: చిత్ర పరిశ్రమలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. మ‌ళ‌యాల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కేరళలో కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. మార్చి 3న కొచ్చిలోని ఒక ప్ర‌యివేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్ర‌మంలోనే చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించ‌డంతో తుదిశ్వాస విడిచారు.

రెండుసార్లు క్యాన్సర్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆయ‌న కోవిడ్ బారిన పడ్డారు. ఆ తరువాత న్యుమోనియాతో బాధపడుతూ.. ఆస్ప‌త్రిలో చేరారు. ఈ క్ర‌మంలోనే ఆరోగ్యం మ‌రింత‌గా దిగ‌జార‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రణించారు. సోమవారం ఆయన పార్థివదేహాన్ని ఎర్నాకుళంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియానికి తీసుకెళ్తారు. మృతదేహాన్ని మూడు గంటల పాటు అక్కడే ఉంచుతార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఆ త‌ర్వాత స్టేడియం నుంచి ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామం ఇరింగళకుడకు తరలించి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

700 చిత్రాల్లో న‌టించిన ఇన్నోసెంట్..

దాదాపు 700 చిత్రాల్లో నటించి, వాటిలో చాలా చిత్రాలను నిర్మించిన ఈ సీనియర్ నటుడు కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా రాణించారు. 2014లో చలకుడి లోక్ సభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో కీలక అంశాల‌పై త‌న వాయిస్ వినిపించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంతాప సందేశంలో “తన సహజమైన నటన ద్వారా ప్రజల హృదయాల్లోకి ప్రవేశించారు. ఆయన మంచి సంఘసేవకుడు కూడా. సినీ పరిశ్రమలోని అన్ని రంగాల్లో తన ఉనికిని చాటుకున్న ఆయన కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా రాణించారని” గుర్తుచేస్తూ నివాళులు ఆర్పించారు.

ఇన్నోసెంట్ ‘క్యాన్సర్ వార్డిలే చిరి’ లేదా ‘స్మైల్ ఇన్ క్యాన్సర్ వార్డు’ అనే ప్రసిద్ధ మలయాళ పుస్తకాన్ని రాశారు. ప్రముఖ మలయాళ దర్శకులలో ఒకరైన మోహన్ దర్శకత్వం వహించిన ‘నృత్యశాల’ చిత్రంతో ఇన్నోసెంట్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇన్నోసెంట్ మలయాళ నటుల సంఘం (అమ్మ) కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 18 ఏళ్ల పాటు ‘అమ్మ’కు నేతృత్వం వహించారు. విశ్రాంత మలయాళ నటులకు పెన్షన్ పథకం కోసం కృషి చేశారు. ‘మజవిల్కవాడి’ చిత్రంలోని ఉత్తమ నటుడిగా ఇన్నోసెంట్ అవార్డు అందుకున్నారు.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న మ‌ర‌ణానికి సంతాపం తెలుపుతున్నారు.

Related Post