దర్వాజ-హైదరాబాద్
Rama Navami Shobha Yatra: శ్రీరామ నవమి వేడుకల క్రమంలో చాలా ప్రాంతాల్లో శ్రీరామనవమి శోభాయాత్రలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్ల చేసుకుంటున్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. యాత్ర సజావుగా సాగేందుకు, శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ఊరేగింపును పర్యవేక్షించేందుకు 1,500 మంది పోలీసులను భద్రత కోసం మోహరించారు.
కాగా, హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు అదే రోజు రాత్రి 7 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు యాత్రను పర్యవేక్షించనున్నారు. ఊరేగింపు పొడవునా పోలీసులు ఉండనున్నారు. యాత్ర కొనసాగే ప్రాంతాల్లోని మసీదులను ఇప్పటికే వస్త్రాలతో కప్పివుంచారు.
శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపుపై నిఘా ఉంచనున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో సోషల్ మీడియా టీం, స్మాష్ టీం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఓ కన్నేసి ఉంచనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.