దర్వాజ-హైదరాబాద్
Rama Navami Shobha Yatra-Traffic advisory: హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి ఊరేగింపు దృష్ట్యా నగర ట్రాఫిక్ పోలీసులు కొన్ని వీధుల్లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలనీ, ఆంక్షలను దృష్టిలో ఉంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఊరేగింపు వల్ల నగరంలోని కొన్ని చోట్ల ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తగినంత సమయంతో ముఖ్యమైన గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు.
శ్రీరామ నవమి ఊరేగింపు తాజా వివరాలు ఇలా ఉన్నాయి..
- ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు సాయంత్రం 7 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాంశాల మైదానంలో ముగుస్తుంది.
- ఈ ఊరేగింపు బోయిగూడ కమాన్, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్పేట్ పురానాపూల్ రోడ్, గాంధీ విగ్రహం, జుమెరాత్ బజార్, బేగం బజార్ ఛత్రి, సిద్దియంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, పుట్లీబౌలి చౌరస్తా, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యామశాలలో ముగుస్తుంది.
- నిర్ణీత మార్గం గుండా ఊరేగింపు వెళ్లినప్పుడు ఈ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉన్నాయి..
గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మళ్లింపు పాయింట్లు మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, అఘాపురా జంక్షన్, గోడే-కి-ఖబర్, పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే వంతెన, లేబర్ అడ్డా, అలాస్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్లలో డైవర్షన్ పాయింట్లు ఉన్నాయి. అలాగే, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, రంగమహల్ జంక్షన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, డిఎమ్ & హెచ్‌ఎస్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, చాదర్‌ఘర్ ఎక్స్ రోడ్, కాచిగూడ ఐనాక్స్, జిపిఓ అబిడ్స్, యూసుఫియాన్ & కంపెనీ, బొగ్గులకుంట ఎక్స్ రోడ్లు ఉన్నాయి. ప్రయాణికులు పోలీసు అధికారులకు సహకరించాలని, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని అధికారులు కోరారు.