Breaking
Sat. Jun 28th, 2025

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

New Delhi, KCR , BRS’s central party office, BRS, న్యూఢిల్లీ, కేసీఆర్, బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం, బీఆర్ఎస్, telangana, తెలంగాణ‌,

దర్వాజ-న్యూఢిల్లీ

KCR inaugurates BRS’s central party office: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తుండ‌గా సీఎం కేసీఆర్ కార్యాలయంలోకి ప్రవేశించారు.

వివ‌రాల్లోకెళ్తే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు అన్ని కార్యక్రమాలు ఏకకాలంలో జరుగుతుండగానే కేసీఆర్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ మంత్రులు పాల్గొన్నారు.

వాస్తు శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత అద్భుతంగా నిర్మించిన నాలుగు అంతస్తుల బీఆర్ఎస్ భవనాన్ని జాతీయ విస్తరణ, ఢిల్లీ నడిబొడ్డున కార్యకలాపాల్లో భాగంగా గత ఏడాది నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే నేడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించారు. ‘దేశ సమగ్రాభివృద్ధి, దేశంలో రైతు పాలన తీసుకురావడం’ లక్ష్యంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడంతో పార్టీ విస్తరణ వేగవంతమవుతుందని పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఢిల్లీలో బీఆర్ ఎస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో బీఆర్ఎస్ భవన్ ను నిర్మించారు. కింది స్థాయిలో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, ప్రధాన కార్యదర్శుల కోసం 4 చాంబర్లు నిర్మించారు. మొదటి అంతస్తులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు ఏర్పాటు చేశారు. రెండో అంతస్తుల్లో అధ్యక్షుడి సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, మిగిలిన 18 ఇతర గదులతో కలిపి మొత్తం 20 గదులు అందుబాటులో ఉన్నాయి.

Related Post