దర్వాజ-పాట్నా
Nitish Kumar’s comments on New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం అవసరమేముందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని నిరసిస్తూ ప్రారంభోత్సవం రోజున ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు జేడీ(యూ) తెలిపింది.
కొత్త పార్లమెంటు భవనం అవసరం లేదు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి సహకారం లేని వారు చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు: బీహార్ సీఎం నితీష్ కుమార్
దేశ చరిత్రను మార్చే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోందనీ, కొత్త పార్లమెంటు భవనం అవసరమా అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశ్నించారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో కొత్త పార్లమెంట్ అవసరం ఏమిటి? అధికారంలో ఉన్నవారు చరిత్రను వక్రీకరించాలని కోరుకుంటున్నారనీ, అదే తరహా పనిచేస్తున్నారని ఆరోపించారు.
తాను ఢిల్లీ వెళ్లి ఇతర పార్టీల నేతలను కలిశానని చెప్పారు. “కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఇది నాకు సంతోషకరమైన విషయం కాదు. పాత పార్లమెంటు మన చరిత్ర. మనకు స్వాతంత్య్రం వచ్చిందనీ, అక్కడి నుంచే ప్రజాస్వామ్య విధానం ప్రారంభమైంద”న్నారు. “అవసరమైతే అభివృద్ధి చేయాలి కానీ కొత్త భవనం నిర్మించడం అర్థరహితం. మీరు మా పాత చరిత్రను మారుస్తున్నారు” అని జేడీయూ నేత వ్యాఖ్యానించారు. అలాగే, శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడంలో అర్థం లేదని నితీశ్ అన్నారు.
నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తే బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కచ్చితంగా డిమాండ్ చేస్తానన్నారు. దేశంలో కుల ఆధారిత జనాభా గణనను యూపీఏ ప్రభుత్వం నిర్వహించిందనీ, కానీ ఎన్డీయే 2021లో ఆ పని చేయలేదన్నారు. బీహార్ లో మా సొంత ఖర్చులతో కుల ఆధారిత సర్వే నిర్వహించామని, అయితే దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీహార్ ముఖ్యమంత్రి అన్నారు. కొత్తగా నిర్మించిన బీహార్ విధాన మండలికి గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించలేదని అడిగిన ప్రశ్నకు నితీశ్ కుమార్ “ఇది భవనం పొడిగింపు, కొత్త నిర్మాణం కాదు” అని అన్నారు.
