దర్వాజ-ఇస్లామాబాద్
Pakistan National Assembly: పదవీకాలం ముగియక ముందే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు అదనపు సమయం పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే ఆగస్టు 8న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాన పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించాయని జియో న్యూస్ నివేదించింది. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ ఐదేళ్ల రాజ్యాంగ కాలపరిమితి ఆగస్టు 12 అర్ధరాత్రితో ముగుస్తుంది.
ఫెడరల్ ప్రభుత్వంలో రెండు ప్రధాన భాగస్వాములైన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆగస్టు 8 న జాతీయ అసెంబ్లీని రద్దు చేయడానికి అంగీకరించాయని సంబంధిత రిపోర్టులు పేర్కొన్నాయి. ఆగస్టు 9, 10 తేదీలు కూడా చర్చకు వచ్చాయనీ, అయితే పార్లమెంటు దిగువ సభను త్వరగా రద్దు చేయడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 8కి వెళ్లాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
కాగా, పాక్ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీని త్వరగా రద్దు చేయకపోతే అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్న వెంటనే 60 రోజుల వ్యవధిలో జాతీయ అసెంబ్లీ లేదా ప్రావిన్షియల్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగబద్ధంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తే 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.