దర్వాజ-రాయ్‌పూర్
raipur: మరోసారి అదానీ గ్రూప్ అంశాలను లేవనెత్తిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీపై విచారణకు ప్రధాని మోడీ ఆదేశించలేరంటూ పలు అంశాలతో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల ప్రభుత్వం ఉంటుందనీ, అదానీలది వుండదని రాహుల్ గాంధీ అన్నారు.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్ గఢ్ లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రాజీవ్ యువమితన్ సమ్మేళన్’ కార్యక్రమంలో లక్ష మందికి పైగా యువతను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. “ప్రధాని మోడీ అదానీపై విచారణకు ఆదేశించలేరు, ఎందుకంటే అది జరిగి, నిజం బయటకు వస్తే, నష్టం అదానీకి కాదు, మరొకరికి ఉంటుంది” అని అన్నారు.
అలాగే, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం దేశ ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేసిందనీ, ఎంపిక చేసిన వ్యాపార దిగ్గజాల బృందం కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు చిన్న వ్యాపారులను నాశనం చేశాయనీ, ప్రధాని మోడీ మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు కావచ్చు, తెలంగాణ, మధ్యప్రదేశ్ లలో రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, అవి అదానీ ప్రభుత్వాలుగా కాకుండా పేదల ప్రభుత్వాలుగా ఉంటాయనీ, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు రాహుల్ గాంధీ న్యూ రాయ్ పూర్ లో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రాజీవ్ యువమితాన్ కాన్ఫరెన్స్ ‘లో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 స్థానాలకు గాను కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 15 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. జేసీసీ (జె) ఐదు స్థానాల్లో విజయం సాధించగా, దాని మిత్రపక్షం బీఎస్పీ రెండు స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ కు 71 మంది సభ్యులు బలం ఉంది.