heavy rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

తెలంగాణ‌, హైద‌రాబాద్, భారీ వ‌ర్షాలు, Telangana, Hyderabad, heavy rains, Hyderabad rains, telangana rains ,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana rains: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఆరుగురు మృతి చెందారు. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేర్వేరు వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో మరో ముగ్గురు నీటమునిగి చనిపోయారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ లో పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వారు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తున్న స‌మ‌యంలో పిడుగుపాటుకు గుర‌య్యారు. మృతులను సరిత (30), మమత (32)గా గుర్తించారు. ఇదే జిల్లాలోని కాటారం మండలం దామరకుంటలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందాడు. రాజేశ్వర్ రావు (46) పొలంలో పని చేస్తుండగా పిడుగు పడింది.

సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. గుమ్మడిదల మండలం మాంబాపూర్ సమీపంలో వాగు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సుధాకర్ (42) మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. వనపర్తి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పెద్దగూడెం శివారులోని చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఘటనలో శంకర్ నాయక్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు.

మరోవైపు సోమవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి సాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. అధికారులు కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పరీవాహక ప్రాంతం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం డ్యామ్ లకు కూడా భారీగా ఇన్ ఫ్లో వస్తోంది.

Related Post