దర్వాజ-బెంగళూరు
Chandrayaan-3: చంద్రునిపై శివశక్తి పాయింట్ వద్ద ఉన్న చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను నిద్రావస్త నుంచి లేపేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. అక్కడ సూర్యోదయం నేడు అవుతుందనీ, -200 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న ఘనీభవన ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ చంద్రుని శివశక్తి బిందువుపై ఈ రెండు మిషన్లు దాదాపు అర నెల రోజులుగా క్రియారహితంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. సెప్టెంబర్ 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యుడు ఉదయిస్తున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న ఘనీభవన ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ చంద్రుడి శివశక్తి పాయింట్ వద్ద ఈ రెండు విషన్లు దాదాపు అర నెల రోజులుగా క్రియారహితంగా ఉన్నాయి. అయితే సూర్యరశ్మి రాకతో వాటి నిర్వహణ పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నారు.
చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని చంద్రయాన్ -3 ల్యాండింగ్ సైట్ లో ఇప్పుడు సూర్యోదయం ఉందని ఇస్రో తెలిపింది. బ్యాటరీలు రీఛార్జ్ అయ్యేందుకు ఏజెన్సీ ఎదురుచూస్తోంది. త్వరలో విక్రమ్, ప్రజ్ఞాన్ లతో కమ్యూనికేషన్లను పునరుద్ధరిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 2 నుంచి విక్రమ్, ప్రజ్ఞాన్ లను దశలవారీగా నిద్రావస్తలోకి దింపామనీ, సూర్యరశ్మితో నడిచే బ్యాటరీలను ఛార్జ్ చేసి, సూర్యోదయానికి కాంతిని స్వీకరించే విధంగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందిస్తుంది కాబట్టి సూర్యోదయం కీలకమని పేర్కొన్నాయి.