దర్వాజ-న్యూఢిల్లీ
PM Modi launches 9 Vande Bharat trains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ వంటి 11 రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీని పెంచే తొమ్మిది వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “గత కొన్నేళ్లుగా అభివృద్ధి చెందని రైల్వే స్టేషన్లు అనేకం ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ స్టేషన్లను అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. రాబోయే 25 సంవత్సరాలలో అభివృద్ధి చేయబడే అన్ని స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లు అని పిలుస్తారు” అని అన్నారు.
“ఈ రోజు ప్రారంభించబడుతున్న తొమ్మిది వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వే కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి. భారతదేశం అంతటా పర్యాటకాన్ని పెంచుతాయి” అని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పటికే 25 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయనీ, ఇప్పుడు మరో తొమ్మిది రైళ్లు వాటికి తోడు కలిశాయని తెలిపారు. వందే భారత్ రైళ్లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. వాటిలో ఇప్పటికే 1,11,00,000 మంది ప్రయాణించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం, పరిమాణం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు సరిగ్గా సరిపోతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
వందే భారత్ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని కలిపే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు. దేశంలో ఆశా, విశ్వాస వాతావరణం నెలకొందనీ, ప్రతి పౌరుడు దేశం సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. చంద్రయాన్ -3, ఆదిత్య-ఎల్ 1 మిషన్ల విజయాలను కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా, జీ-20 శిఖరాగ్ర సమావేశం విజయం భారతదేశ ప్రజాస్వామ్యం, జనాభా, వైవిధ్య బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని మోడీ అన్నారు.
కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లు ఇవే..
ఉదయ్ పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
తిరునల్వేలి – మధురై – చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్
హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్
విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్ ప్రెస్
పాట్నా – హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
కాసర్ ఘడ్ – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్
రూర్కెలా – భువనేశ్వర్ – పూరీ వందే భారత్ ఎక్స్ ప్రెస్
రాంచీ – హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
జామ్ నగర్ – అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఈ వందే భారత్ రైళ్లు తమ కార్యకలాపాల మార్గాల్లో అత్యంత వేగవంతమైన రైలుగా ఉంటాయనీ, ప్రయాణికులకు గణనీయమైన సమయం ఆదా అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
