Breaking
Sat. Jun 28th, 2025

ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

what is ur problem
what is ur problem

అన్నా.. నువ్వు అడిగిందానికి స‌మాధానం చెప్తే.. అధిక తెలివి సూపియ‌కంటివి. ఇక‌ చేప్ప‌క‌పోతే.. ఎడ్డోడా అంటివి. స‌ప్పుడు సేయ‌కుండా ఉంటే.. మూగిపాసు అంటివి. ఏందే గీ క‌ర్మ‌.. ఏది మాట్లాడినా, ఏమీ మాట్లాడ‌కున్నా వంక‌లు పెడితివి. ఏది చేసిన వ్యంగ్యంగా మారిస్తివి. మ‌రెట్లా సెప్పు నేను ఉండేది ? నా బాడీ క‌ల‌ర్, వేసుకునే బ‌ట్ట‌లు, తినే తిండి గురించి నీ కెందుకే..?

అరే.. గీడేంది ఎదో ఉద్దేర ముచ్చ‌ట ప‌ట్టుకొచ్చిండు అనుకుంటిరా..? జ‌ర ఆగుర్రి.. మీకు కూడా ఎరుకైత‌ది. గా పైన చెప్పిన మాటాల‌ను మీరు విన్న‌వారో లేక.. అన్న‌వారో అయ్యే అవ‌కాశం మ‌స్తు ఉంది. మీరు అసుమంటి మాట‌లు వింటే మీ జీవితంలో గాటిని మ‌ర్చిపోరు. అవి నిరంత‌రం మిమ‌ల్ని గుచ్చుతూనే ఉంటాయి. లేక మీరే అలాంటి మాట‌లు మాట్లాడితే.. మీవ‌ల్ల ప‌క్క‌నొళ్లు లెస్స తిప్ప‌లైతే ప‌డుతుర్ర‌ని అర్థం సేసుకోరి.

అవునుబై.. మీరు ఒక‌ని క‌ష్టాన్ని ఆర్చేటొళ్లు కారు.. తీర్చే టొళ్లు కారు. మీకెందుకు చెప్పు గీ ఉద్దెర‌ ముచ్చ‌ట్లు. అరే మీరు అనే మాట‌ల‌తో అవ‌త‌లోడు ఎంత బాధ పడ‌తాడో నీకేం తెలుసు. గా ప్లేస్ లో నువ్వు ఉంటే ఎరుకైత‌ది. నీకైతే మీ అయ్య తిప్ప‌లు ప‌డో.. లేక ఎవ‌ని నెత్తిలో చేతులు పెట్టో.. ఫైస‌లు తెచ్చి ఇచ్చే. గ‌ట్ల‌నే వాటి విలువ చెప్ప‌క‌పాయే.. వాడు గ‌ట్లా కాదు క‌దా!

what-is-the-problem-with-me1 ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

వాని అయ్య చాలా ముచ్చ‌ట్లు వానికి చెప్పే. “ఫైస‌లు ఉట్టిగ‌నే రావు బిడ్డా.. జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేసుకో..” అని చెప్పే. లేక‌పోతే సంపాధించుకుని ఖ‌ర్చు చేసుకోమ‌నే.. అసుమంటోడు “నీలా రంగురంగుల‌ బ‌ట్ట‌లు, తీరొక్క బూట్లు, క‌మ్మ‌టి వాసనొచ్చే సెంటు కొట్ట‌లేడు క‌దా!”. గ‌సుమొంటోడు త‌ప్ప‌క నీతో దోస్తాన్ చేస్తుండు కానీ.. నువ్వేదో పుడింగ్ అని కాదు.

నీతో ఎంతో మంచిగ ఉండ‌నీకే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. నువ్వేం సేస్తివే.. “రోజూ ఇదే అంగి వేసుకుంట‌వా ?”, “ఈ రోజు కూడా గాతొక్కే వేసుకొస్తివా ?”, “గిట్ల ఎట్టా బ‌తుకుతారురా ?” అంటావ్.. వాడు నీతో ఏదో చెప్పాల‌ని చూస్తే.. నువ్వేమో నీ రాక్ష‌స ఆనందాన్ని తీర్చుకోనికే.. వాడి గ‌రీబు బ్యాగ్రౌండ్ ను వాడికి క్ష‌ణ క్ష‌ణం గుర్తు చేస్తుంటివి.

గిది నీకేమ‌న్న సమంజ‌స‌మేనా ? వాడి తెలివిని వాడి వేసుకున్న బ‌ట్ట‌ల్లోనే చూసే నీకు ఎన్న‌టికైనా బుద్ధి వ‌స్త‌దంటావా ? అన్నా.. మ‌ట్టి గురించి తెలుసా నీకు? గ‌ది గ‌లీజ్ గానే ఉంటదే.. కానీ దానికి దేన్నైనా పండించ‌గ‌ల శ‌క్తి ఉంట‌ది. గ‌ట్లే నీ గ‌రీబ్ దోస్తు కూడా ఏదో ఒక‌రోజు నీకు అంద‌నంత ఎత్తుకు ఎదుగుతాడేమో..!

గ‌ప్పుడు నీ మొఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్..? గ‌ప్పుడు గీ ఫైస‌ల పైత్యం ఎటుపోత‌ది. అబ్డుల్ క‌లాం, అంబేద్క‌ర్ లాంటి వ్య‌క్తులు నీలా ఫైస‌లున్నోళ్ల ఇండ్ల‌ళ్ల పుట్ట‌లేదే.. వాడిలా గ‌రీబ్ ఇండ్ల‌ల్లో నుంచి పుట్టున్రు. గ‌సుమొంటోళ్లే క‌దా.. మ‌ట్టిలో మాణిక్యాలు అంటే. నీ దోస్తు కూడా గ‌ట్ల‌నే అవుత‌డు. నీ సాయం ఉంటే. నీ మాట‌ల‌తో పోట్లు పెట్ట‌కుంటే.

what-is-the-problem-with-me3 ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

నువ్వు చేయాల్సింద‌ల్లా.. వాడి తెలివిని వాడు వేసుకున్న బ‌ట్ట‌ల్లో.. తినే తిండిలో.. కొట్టుకునే సెంటులో చూడ‌కుండా ఉంటే చాలు. “మ‌రేం ప‌ర్లేదురా.. దా పోదాం ప్రపంచాన్ని ఏలేది మ‌న‌మే” అనే ధైర్యాన్ని వాడికి ఇవ్వాలి. గ‌ప్పుడు నీ గ‌రీబు దోస్తు ఏంటో నీకు, నువ్వోంటో వాడికి పూర్తిగా ఎరుకైత‌ది. గా దోస్తాన్ చిర‌కాలం ఉంట‌ది.

అరే ఇంకోటి.. వాడు ఫైస‌ల్లో బికారి కావొచ్చు. కానీ నీకంటే.. 1000% రెట్లు తెలివైనోడు. నీ అంత ఫాష్ గా మాట్లాడ‌క‌పోవ‌చ్చు కానీ.. నీ కంటే ఎంతో గొప్ప‌గా మాట్లాడుతాడు. నీ అంత ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌చ్చు కానీ.. నీకంటే గొప్ప‌గా పొదుపు చేయ‌గ‌ల‌డు. నీ సంబంధాలు ఫైస‌ల‌తో ముగిప‌డి ఉండొచ్చు. కానీ వాడి సంబంధాలు ప్రేమ‌తో ముడిప‌డి ఉంటాయి.

గందుకే ఒక‌డు వేసుకున్న చిరిగిన‌ బ‌ట్ట‌ల‌ను, తినే తిండిని, మాట్లాడే తీరును నువ్వు హేలన చేసుడు బంజేయాలే. నీకు అలా మాట్లాడితేనే మంచిగుంట‌ది అంటే అర్జెంట్ గా నువ్వు ఎర్ర‌గ‌డ్డ‌పోయి డాక్ట‌ర్ల‌ను క‌ల‌వాలి. మాన‌సికంగా ఎన్నో రోగాలు ఉన్నాయి కాబ‌ట్టి ట్రీట్ మెంట్ సేస్త‌రు. ఆ ట్రీట్ మెంట్ లో నీకు క‌రెంట్ షాక్ పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

what-is-the-problem-with-me2 ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

చివ‌ర‌గా చెప్పేది ఏంటంటే.. ఒక‌డు చిరిగిన, పాత బ‌ట్ట‌లు వేసుకుంటున్నాడు, లేక రోజూ ఒకే ర‌క‌మైన తిండి తింటున్నాడు అంటే దానికి అర్థం వాడి ద‌గ్గ‌ర గంతే ఉందని. ఉన్న‌దాంట్లో మంచిగ ఉంటుండు. దాన్ని మీరు హేల‌న చేయొద్దు. వాడ‌ని మాన‌సికంగా కృంగిపోయేలా చేయొద్దు. ఆ పోర‌గాళ్ల బ‌ట్ట‌లు మురికిగా ఉంటాయేమో.. కానీ మ‌న‌సు మాత్రం వెన్న‌. మాట గ‌డుసుగా ఉంటుందేమో.. అందులో అంతులేని ప్రేమ ఉంటుంది. దీన్ని అర్థం సేసుకోనికే మీకు టైం ప‌ట్టొచ్చు. కానీ ట్రై చేసి చూడండి అప్పుడు నీలో క‌నిపించే మార్పు మాములుగా ఉండ‌దు.

srikanth-padma ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

శ్రీకాంత్ ప‌ద్మ‌,
షాద్ న‌గ‌ర్.
srikanth.sk49@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

ప్రేమంటే సంపేసుడేనా ?

Related Post