Darvaaja-Hyderabad
IPL 2025:గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల భారత క్రికెట్ జట్టు యంగ్ ప్లేయర్ మయాంక్ యాదవ్ పై లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్, భారత లెజెండరీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత అతను భారత జట్టులో విరామం లేకుండా ఆడాలని ఆశాభావం వ్యక్తంచేశాడు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు చేస్తున్న విషయాలు ప్రస్తావించాడు.
మయాంక్ యాదవ్ ఫిట్నెస్ రాబోయే ఐపీఎల్లో జట్టు ప్రదర్శనను నిర్ణయిస్తుందని లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్, మెంటార్ జహీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్ ను ఎక్కువ కాలం ఆడించడం చాలా ముఖ్యమని జహీర్ ఖాన్ అన్నాడు. ఈ విషయమై లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో కూడా మాట్లాడినట్లు తెలిపాడు.
ఐపీఎల్ 2024లో మయాంక్ యాదవ్ 3 మ్యాచ్ లలో 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. అతను 12 ఓవర్లలో 30 బంతుల్లో 150+ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ అద్భుతమైన రికార్డును ఊహించలేని ఘనతగా చెప్పవచ్చు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే 2 ఓవర్లలో 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాడు. అద్బుతమైన బౌలింగ్ గణాంకాలు సాధించిన అతను జట్టులో కొనసాగలేకపోయాడు. అతనికి గాయాలయ్యాయి. దీంతో మళ్లీ జట్టులోకి రాలేదు. ఐపీఎల్ 2025 కోసం ఎల్ఎస్జీ అతడిని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది.
మయాంక్ యాదవ్ లాంటి బౌలర్ చాలా కాలంగా నిలకడగా బౌలింగ్ చేయాలనేది తన ఉద్దేశమనీ, గాయాల కారణంగా అతను విరామం తీసుకోకుండా ఉండేందుకు అతనితో కలిసి పనిచేస్తున్నానని జహీర్ ఖాన్ తెలిపాడు. కాబట్టి అతను 100 శాతం మాత్రమే కాకుండా 150 శాతం ఫిట్‌గా ఉండాలనే భావనతో ఐపీఎల్ 2025 కోసం పని చేస్తున్నామని వెల్లడించారు.