Darvaaja – Hyderabad
Can drinking hot tea cause cancer: పొగలు కక్కుతున్న వేడివేడి టీని తాగడం ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. అయితే, ఇలాంటి టీ తాగితే క్యాన్సర్ బారినపడే ఛాన్స్ వుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వేడి పానీయాలు క్యాన్సర్ కు కూడా దారితీస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వేడి టీ, కాఫీ వంటి పానీయాలు మీ ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తాయి? గ్రీన్ టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిదేనా? అనే విషయాలు పలువురు వైద్యులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం..
ప్రపంచవ్యాప్తంగా అన్నవాహిక క్యాన్సర్లలో ఎక్కువ భాగం పొలుసుల కణ క్యాన్సర్ వర్గానికి చెందినవి. ఐరోపా,అమెరికా దేశాల్లో ఇది ప్రధానంగా ధూమపానం, మద్యపానం వల్ల వస్తుంది. ధూమపానం, మద్యపానం పురుషులలో ఎక్కువగా ఉండటం దీనికి కారణం కావచ్చు. అయితే, ఇరాన్ లోని గోలెస్టాన్ ప్రావిన్స్ లో స్త్రీ, పురుషులిద్దరిలోనూ అన్నవాహిక కేన్సర్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
ఇది ధూమపానం, మద్యపానం అస్సలు తీసుకోని ప్రాంతం. కానీ, ఇక్కడి ప్రజలు చాలా వేడి టీ తాగడం ఆనవాయితీ. తరువాతి అధ్యయనాలలో, వేడి టీ / కాఫీ తాగినవారికి ఇతరులకన్నా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
బాగా వేడి చేసిన పానీయాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే అన్నవాహిక క్యాన్సర్ కూడా చైనాలోని లిన్క్సియన్ ప్రావిన్స్ లో గుర్తించారు. వేడి వేడి టీ తాగడం, కణ క్యాన్సర్ ప్రభావాలకు సంబంధించి చాలా పరిశోధనలు ఉన్నాయి. చాలా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహికలోని కణాలు దెబ్బతింటాయి. ఇది నిరంతర ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.