- 2050 నాటికి 25 శాతం మందికి వినికిడి సమస్యలొస్తాయ్
- భారత్ లో ప్రతి యేడాది 27000 మంది పిల్లలు..
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి
దర్వాజ-న్యూఢిల్లీ: అంతర్జాతీయ వినికిడి దినోత్సవాన్ని (మార్చి 3)పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) వినికిడికి సంబంధించిన తాజాగా అంతర్జాతీయ నివేదికను విడుదల చేసింది. రానున్న మరో ముప్పై సంవత్సరాలలో వినికిడి సమస్యతో బాధపడే వారి సంఖ్య భారీగా పెరుగుతుందనీ, భారత్ లోనూ ఈ ముప్పు అధికంగానే ఉంటుందని హెచ్చరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
డబ్ల్యూహెచ్ వో నివేదికలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు (25 శాతం) వినికిడి సమస్య బారినపడతారు. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్యలున్నాయి. 2019లో 160 కోట్ల మంది చెవి సమస్యల బారిన పడితే.. రానున్న 30 ఏండ్లల్లో అది 250 కోట్లకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్ లో..
భారతదేశంలోనూ వినికిడి సమస్య బాధినపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం దేశంలో 27,000 మంది పిల్లలు చేవిటివారు పుడుతున్నారు. అలాగే, వినికిడి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నవారి సంఖ్య అధికంగా ఉంది. ఎందుకంటే ఇది కనిపించేది కాదు. అలాగే, చాలా సందర్భాల్లో రోగ నిర్ధారణ కూడా ఆలస్యం అవుతుంది.
రాబోయే నష్టాన్ని తగ్గించాలంటే..
వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం ఒక్కరిపైనా 1.33 డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. మొదట్లోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపకపోవడం వల్ల నష్టం రెట్టింపై ఏటా లక్ష కోట్ల డాలర్ల జరుగుతోందని తెలిపింది. ఆందోళనకరమైన విషయం ప్రస్తుతం ఉన్న చాలా మంది నిపుణులు ఈ సమస్యలను గుర్తించలేకపోతున్నారట. అలాగే, నివారణ చర్యలు సైతం వారికి తెలియడం లేదని నివేదిక పేర్కొంది.
