దర్వాజ-హైదరాబాద్
గోదావరి, కృష్ణా జలాలపై రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి నీటిలో అన్యాయం చేయాలని చూసే యత్నమనీ, దీనిని ఎదుర్కొనడమే తమ ప్రాథమిక లక్ష్యమని అన్నారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలతో ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ప్రధానంగా గోదావరి జలాలను బనకచర్లకు తరలించే ప్రాజెక్టు, దాని పర్యవసనాలు, రాష్ట్రానికి కలిగే నష్టాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఇంజనీరింగ్ నిపుణులు బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బొల్లెపల్లి వరకు 300 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు వేసిన విషయాన్ని వివరించారు.
ఈ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి, ఆర్థిక మంత్రి, పర్యావరణ మంత్రిని కలసి అభ్యంతరాలు తెలుపామని సీఎం తెలిపారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించనున్నట్టు చెప్పారు.
అన్ని చర్యలు ఫలించకపోతే న్యాయపరంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వశాఖలతో సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్టు అనుకోకుండా ప్రస్తుత దశకు రాలేదని సీఎం గుర్తుచేశారు. 2016లో గోదావరి జలాల వృథా గురించి జరిగిన చర్చ, 2019లో అప్పటి సీఎం కేసీఆర్, జగన్ మధ్య సమావేశాల్లో గోదావరి నీటిని రాయలసీమకు తరలించడంపై అభ్యంతరం చెప్పకపోవడం వల్లే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందని వివరించారు.
ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం పిలుపునిచ్చారు. “ఈ పోరాటం తెలంగాణ కోసం, రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుదాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
