Breaking
Tue. Nov 18th, 2025

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ స్టార్ట్.. 15 మంది కంటెస్టెంట్స్ వీరే

Bigg Boss Telugu 9 15 contestants
Bigg Boss Telugu 9 15 contestants

దర్వాజ – హైదరాబాద్

Bigg Boss Telugu 9:  తెలుగులో అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున సోనియా సోనియా పాటకు డ్యాన్స్ చేస్తూ అద్భుతంగా ఎంట్రీ ఇచ్చి వేదికను ఊపేశారు. గత ఎనిమిది సీజన్లకంటే ప్రత్యేకంగా, ఈసారి “అగ్నిపరీక్ష” పేరుతో సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం విశేషం. ప్రేక్షకులు, జ్యూరీ మెంబర్స్ నిర్ణయంతో ఎంపికైన ఆరుగురు సాధారణ పోటీదారులు కూడా హౌస్‌లో అడుగుపెట్టారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌసులోకి వెళ్లిన 15 మంది పోటీదారులు

1. తనూజ – తొలి కంటెస్టెంట్

కన్నడ నటి తనూజ తొలిపోటీదారుగా హౌస్‌లోకి ప్రవేశించింది. తెలుగు ప్రేక్షకులకు ‘ముద్దముందారం’ సీరియల్ ద్వారా పరిచయమైంది. తన గురించి “అందంగా ఉంటాను, వంట చేస్తాను, అమాయకురాలిని” అని వివరించింది. హోస్ట్ నాగార్జున కోసం మటన్ బిర్యానీ కూడా వండి తీసుకువచ్చింది.

2. ఫ్లోరా సైనీ

‘లక్స్ పాప’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఆశా సైనీ అసలు పేరు ఫ్లోరా సైనీ అని ఈ వేదికపై వెల్లడించింది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించిన ఫ్లోరా, బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

3. పవన్ కల్యాణ్ (జవాన్)

ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, అగ్నిపరీక్షలో గెలిచి ప్రేక్షకాదరణతో తొలి కామనర్‌గా హౌస్‌లోకి వచ్చాడు.

4. ఇమ్మాన్యుయేల్

పలు కామెడీ షోలతో ప్రజాదరణ పొందిన ఇమ్మాన్యుయేల్, తన మల్టీ టాలెంట్‌ను మిమిక్రీ, పాటల ద్వారా స్టేజీపై చూపించాడు.

5. శ్రష్ఠి వర్మ

‘ఢీ’ షో ద్వారా గుర్తింపు పొందిన శ్రష్ఠి వర్మ, కొరియోగ్రాఫర్‌గా పలు స్టార్ సినిమాల్లో పనిచేసింది. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది.

6. మాస్క్ మ్యాన్ హరీశ్

జ్యూరీ మెంబర్ బిందుమాధవి ఎంపిక చేసిన హరీశ్, తన కల నెరవేరిందని చెబుతూ రెండో కామనర్‌గా హౌస్‌లోకి చేరాడు.

7. నటుడు భరణి

‘చిలసౌ స్రవంతి’ సీరియల్‌తో ఫేమస్ అయిన భరణి, మొదట సీక్రెట్ బాక్స్‌తో వేదికపైకి వచ్చి సస్పెన్స్ క్రియేట్ చేశాడు. మొదట బయటకు వెళ్లినా, తర్వాత బిగ్‌బాస్ నిర్ణయంతో తిరిగి హౌస్‌లోకి వెళ్ళాడు.

8. రీతూ చౌదరి

సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన రీతూ, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో వైరల్ అవుతోంది. అసలు పేరు దివ్య అని, స్కూల్‌లో అదే పేరుతో చాలామంది ఉండడం వల్ల తన పేరు రీతూగా మార్చుకున్నట్లు చెప్పింది.

9. డీమాన్ పవన్

జపనీస్ నవలల ప్రభావంతో “డీమాన్” అన్న టైటిల్ తన పేరుకి జోడించుకున్న పవన్, ప్రేక్షకుల ఓట్లతో ఎంపికయ్యాడు.

10. సంజనా గల్రానీ

మోడలింగ్‌లో అడుగుపెట్టి, పలు సినిమాల్లో నటించిన సంజనా, ఒక కేసులో అన్యాయంగా ఇరుక్కుపోయానని, కానీ హైకోర్ట్ నుంచి క్లీన్ చిట్ వచ్చినట్లు తెలిపింది. తాను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తిని కాదని నిరూపించుకోవడానికి ఇక్కడికొచ్చానని చెప్పింది.

11. రాము రాథోడ్

‘రాను బొంబాయికి రాను’ పాటతో పాపులర్ అయిన రాము రాథోడ్, మ్యూజిక్ జర్నీ లాక్‌డౌన్‌లో ప్రారంభమైందని, ప్రత్యేక శిక్షణ లేకుండానే పాటలు పాడుతున్నానని చెప్పుకొచ్చాడు.

12. శ్రీజ దమ్ము

జ్యూరీ మెంబర్ నవదీప్ ఎంపిక చేసిన శ్రీజ, తన ధైర్యం, స్పీడ్ కారణంగా సెలెక్ట్ అయ్యానని తెలిపింది. హౌస్‌లోకి వెళ్లే ముందు “నామినేషన్స్‌లో ఉన్నా, నన్ను తప్పక సేవ్ చేయండి” అని ప్రేక్షకులను కోరింది.

13. సుమన్ శెట్టి

‘జయం’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన సుమన్ శెట్టి, రెండో ఇన్నింగ్స్ కోసం బిగ్‌బాస్ మంచి అవకాశం అని భావిస్తున్నాడు. తన ఫన్నీ డైలాగ్స్‌తో వేదికపైనే నవ్వులు పూయించాడు.

14. ప్రియ

ప్రేక్షకుల ఓట్లతో ఎంపికైన డాక్టర్ ప్రియ, చిన్నప్పటి నుంచి నటిగా మారాలనుకున్నా కుటుంబ కారణాల వల్ల ఆ కలను వదిలేశానని తెలిపింది. ఇప్పుడు అమ్మ సూచనతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చానని చెప్పింది.

15. మర్యాద మనీష్

అగ్నిపరీక్ష పోటీలో పాల్గొన్న మనీష్, యాంకర్ శ్రీముఖి ఎంపికతో చివరి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చేరాడు.

హౌస్ డైనమిక్స్ – ఔట్ హౌస్ ట్విస్ట్

ఈ సీజన్‌లో పెద్ద ట్విస్ట్‌గా సెలబ్రిటీలు మొదట ఔట్ హౌస్‌లో ఉండి, అగ్నిపరీక్షలో గెలిచిన కామనర్స్ మాత్రం నేరుగా మెయిన్ హౌస్‌లోకి వెళ్లారు. ఈ కొత్త ఫార్మాట్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. సెలబ్రిటీలు ఒకవైపు, కామనర్స్ మరోవైపు పోటీ పడనున్న ఈ సీజన్‌లో ఎవరు ఎలా ఆడతారు? ఎవరు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు? అనే ఆసక్తి పెరుగుతోంది.

Related Post