Breaking
Tue. Nov 18th, 2025

Kurnool: కర్నూలులో ఘోర బస్సు అగ్నిప్రమాదం.. 20 మందికి పైగా సజీవ దహనం.. కారణం ఏమిటి?

Kurnool Bus Fire Tragedy Claims Over 20 Lives
Kurnool Bus Fire Tragedy Claims Over 20 Lives

దర్వాజ – కర్నూలు

Kurnool bus accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకి బయల్దేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా, మిగిలిన వారిలో పలువురు సజీవ దహనం అయ్యారు.

కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది?

తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బస్సు కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తుండగా ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆ బైక్‌ బస్సు ముందు భాగంలోని ఇంధన ట్యాంకును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఆ మంటలు బస్సు మొత్తాన్ని కమ్మేశాయి. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో, చాలామంది బయటపడే లోపే మంటల్లో చిక్కుకున్నారు.

మంటల మధ్య సహాయం కోసం హాహాకారాలు

మంటలు వ్యాపించడంతో బస్సు అంతా హాహాకారాలు వినిపించాయి. కొందరు అత్యవసర ద్వారం బద్దలు కొట్టి బయటపడగా, మరికొందరు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి సమీపంలోని గ్రామస్తులు, మార్గమధ్యంలో ప్రయాణిస్తున్న వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని అగ్నిని అదుపులోకి తెచ్చాయి.

ప్రాణాలతో బయటపడిన వారు ఎవరు?

ప్రమాదం నుంచి బయటపడిన వారిలో రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్‌, అఖిల్‌, జష్మిత, అకీర, రమేష్‌, జయసూర్య, సుబ్రహ్మణ్యం ఉన్నారు. హిందూపూర్‌కు చెందిన నవీన్‌ తన కారులో గాయపడిన ఆరుగురిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా గమనించిన హైమా రెడ్డి అనే మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.

పోలీసుల ఏమన్నారంటే?

కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రకారం, బస్సు డ్రైవర్‌ మొదట చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్‌ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ, మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపులో లేకుండా పోయింది. మరో డ్రైవర్‌ను నిద్రలేపి ప్రయాణికులను బయటకు రప్పించే ప్రయత్నం చేసినా అప్పటికే మంటలు ఘోరంగా వ్యాపించాయి. ఇద్దరు డ్రైవర్లు ఘటన అనంతరం పారిపోయారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దగ్ధమైన బస్సు, దుఃఖంలో కుటుంబాలు

బస్సు నంబర్‌ DD01N 9490 పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల్లో ఎక్కువమంది హైదరాబాద్ నగరానికి చెందినవారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను కర్నూలు కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీటి మునిగిపోయాయి.

కర్నూలు బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్లపై భద్రతా చర్యలు, వాహనాల ఇంధన వ్యవస్థ పర్యవేక్షణ వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఒక చిన్న తప్పిదం ఎంత ప్రాణ నష్టం కలిగించగలదో ఈ ఘటన చాటిచెప్పింది.

Related Post