“ఓ అక్క చూసావానే..
నాకు ఆడ బిడ్డ పుట్టింది..
మా అమ్మ పుట్టిందే..
మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది..
ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో గానీ..
నాకు ఆడబిడ్డ పుట్టిందే..”
“దేవుడా నీకు ఓ కోటి దండాలయ్యా.. నువ్వు నా కోరిక తీర్చేసావ్.. ఎన్ని మొక్కులు మొక్కుకున్నానయ్యా ఆడబిడ్డ పుట్టాలని.. ఇప్పటికి నా కోరిక తీర్చినవు.. ఎక్కడ పిలగాడు పుడుతడోనని ఎంత భయపడ్డానో తెలుసా? పిల్లాడు పుడితే అక్కడే పాడేసి వద్దామనుకున్నా.. కానీ నువ్ అలా చెయ్యలేదు.. నేను ఎంతో అదృష్టవంతురాలిని భగవంతా!”
“నా చిట్టి తల్లే నాకు ప్రపంచం.. కంటికి రెప్పలా కాపాడుకుంటా నా తల్లిని. తన చిట్టి పాదాలకు నేను నడకనైత.. తన ప్రతీ కష్టంలో నేను తోడుంట. నా బిడ్డను పెద్ద సదువులు సదివిస్తా.. ఇంకా తను ఏం కావాలంటే అది చేస్తా.. నా తల్లి పెద్దగైతే.. అదే నాకు అన్ని నేర్పిస్తది.. నా బంగారు తల్లిని అందరూ గర్వించే విధంగా పెంచుకుంటాను.. అవును నాకు నా బిడ్డంటే అంత పాణం మరి..”
“అందరికీ కొడుకులు పుడితేనే మంచిగంటరు. సచ్చేదాకా గుక్కెడు గంజి నీళ్లు పోస్తాడని.. అందరు ఎరుగనిది ఏందంటే. పెద్దగైనంక వాడికి నువ్ కూడా పరాయోనివనే ముచ్చట మురుస్తరు. కానీ నా బంగారు తల్లి అలా కాదు. సమాజమంతా వద్దనుకుంటున్న నాకు నా తల్లే ప్రపంచం. తను మా యమ్మ..”

వినడానికి ఎంత బాగున్నాయ్ ఈ పైన చెప్పిన మాటలు..? కానీ ఎంత మంది తల్లులు ఇలా ఫీల్ అవుతున్నారు ? 100 మందిలో కనీసం ఒక 20 మంది అమ్మలైనా తనకు అమ్మాయే పుట్టాలని కోరుకుంటున్నారా ? కొడుకులు కావాలనుకుంటున్నంత ఆశతో కూతుర్లను కావాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. “నీకు తల్లి, అక్క, చెల్లి, భార్య అనే బంధాలు కావాలి కానీ కూతురు అనే బంధం మాత్రం వద్దు.. ఏ ఎందుకని ?”
ఎంతో మంది ఆడబిడ్డ పుడితే.. ఎలా ఫీలవుతారో ఎరుకనా ? పెండ్లాం కడుపుతోనే ఉందంటే చాలు.. అప్పటి నుంచి ఆ తల్లికి పోరు మొదలైతది. “దీనికి అదృష్టం ఉందో లేదో.. మొదటి కాన్పులో మగబిడ్డ పుడితే ఎంతో బాగుంటది”. “నువ్వు ఇప్పటినుంచే పూజలు, పునస్కారాలు చెయ్యమ్మా.. పిలగాడే పుట్టాలని చెట్టుకు, పుట్టకు.. కనిపించిన ప్రతి దేవున్ని మొక్కుకో..” అంటూ కనబడ్డ ఎల్లమ్మ, పుల్లమ్మ ఉచిత సలహాలు ఇస్తునే ఉంటుంది కదా!
ఇంకొందరైతే కడుపులో పిల్లనా ? పిలగాడా ? అంటూ ఆత్రం ఆపుకోలేక ఆస్పత్రులకు పోతుంటారు. అక్కిడికి వెళ్లేముందే వీళ్లు ఒక నిర్ణయానికి వస్తారు. అదేంటంటారా.. పిల్ల అయితే దాన్ని కడుపులో చంపేద్దామని, పిలగాడైతే.. పదిమందికి తెలిసేలా పండుగ సేసుకుందామని ఒక ఒప్పందం కూడా సేసుకుంటారు.
ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. రక్తపు ముద్దను కూడా నలిపేసేటోళ్లు నేటికీ కోకొల్లలు. ఇంతకు ఆడబిడ్డ చేసిన తప్పేంటండి? ఎందుకు ఆడపిల్ల ఎవరికీ వద్దు ? ఏం పాపం చేసిందని వద్దనుకుంటారు ?

మీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నందుకా..? లేకపోతే తను ఎవరికీ భారం కాకూడదు అని చెప్పి అన్నింటికీ దూరంగా ఉంటున్నందుకా ? లేకపోతే అన్నితానై కుటుంబాన్ని పోషిస్తున్నందుకా ? మరీ పాపం కదండీ పిచ్చిది మీరు ఏం చేసినా.. తన మంచికే అనుకుంటది. ఆఖరికి ఆడపిల్లవు నీకెందుకే సదువు. ఈ పనులు అని అన్నాకూడా సప్పుడు చేయదు కదా!
డబ్బులకు ఆశపడి ముసలాడు అనికూడా చూడకుండా కట్టబట్టి పడేస్తున్నారు. అయినా తల వంచుకునే కదా పోతుంది? అందుకే కదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నరు? మీ అదృష్టం బాగుండి ఆడపిల్ల పుడితే.. “ఈ మొదనష్టపుది నాకే పుట్టాలా.. నేను దురదృష్టవంతురాలిని.. నాకే ఇందుకిలా జరుగుతుంది అంటూ తెగ బాధ పడిపోతూ.. వద్దు నువ్ నాకు వద్దు..” అంటూ పసికందని కూడా చూడకుండా గొంతుల వరిగింజ వేసి మరీ సంపుతున్నారు కదా!.
అంత చేసి కూడా ఏం పాపం ఎరుగని వాళ్లలాగే “ఎట్లసచ్చిపోయిందో..” అంటూ మస్తు నాటకమాడుతుంటారు కదా!. మరికొందరు తండ్రులైతే.. ఆడపిల్ల పుట్టిందనే వార్త తెల్వంగనే.. ఆ పసి కందు మొహం కూడా చూడకుండా దావఖానాలోనే వదిలేసి వెళ్లిపోతున్నరు. మరికొందరైతే ఆడపిల్ల అని అది పుట్టకుముందే లక్షలకు బేరాలు ఆడుతున్నరు.

ఇదెక్కడి అన్యాయమండీ! కడుపులో ఉండే పసికందుకు కూడా బేరాలు పట్టి వ్యాపారాలు చేస్తారా ? కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఎలా అమ్మాలనిపిస్తది ? ఎందుకు మీరు డబ్బుల కోసమే పిల్లలను కంటున్నారా ? డబ్బులు సంపాదించడానికి మీకు ఉన్న ఏకైక మార్గం అదొక్కటేనా ? వేలకు, లక్షలకు బేరాలు పెట్టి కన్నపేగును అమ్ముకుంటున్న మీరు మనుషులేనా అసలు? ఎంతో మంది చిన్నారులు ఎవరి కడుపులోనో పుట్టి మరొకరి ఇంట్లో బతుకుతున్నరు.
అసలు అమ్మబడుతున్న పిల్లలు ఎక్కడ, ఎలా పెరుగుతున్నారనే విషయం మీకు తెలుసా? తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా ? అలా అమ్మాకాలకు గురైనా ఎంతో మంది పిల్లలు వ్యభిచార కొంపల్లో మగ్గుతున్నారన్న విషయం మీకు తెలసా? వారికి దిక్కు మొక్కంటూ ఎవరూ లేక అనాథలుగా చిత్రవధ అనుభవిస్తున్నారని తెలుసా ? తెలిసే అమ్మేస్తున్నారా ఏంది? అసలు సమాజం ఎందుకిలా తగలబడుతుంది?
చిన్నపిల్లల సంగతి ఇంత దారుణంగా ఉంటే.. పెద్దగైన పిల్లలను సైతం కన్న తల్లిదండ్రులు అమ్మేస్తున్నారు. ఫైసలకు ఆశపడి పెండ్లి ఈడుకొచ్చిన బిడ్డలను రూ. 10 వేలకు, రూ. 20 వేలకు అమ్ముకుంటున్నరు. మొన్నటికి మొన్నఓ కసాయి తండ్రి రూ. 2 లక్షలు అప్పు చేశానని.. అది తీర్చలేకపోతున్నాని.. అప్పు ఇచ్చిన వ్యక్తికి అప్పుకిందికి సొంత కూతురిని అప్పగించిన దుస్తితి వెలుగు చూసింది. ఆమెను తీసుకుపోయినోడు ఆ యువతిపై ఎన్నో సార్లు అత్యాచారం చేశాడు. దీన్ని అడిగే దిక్కు లేదు ఆ యువతికి.

మరో ఘాతుకానికి వస్తే.. వరుసగా ముగ్గురు కూతుర్లే పుట్టారని రూ. 20 వేలకు ఒకరిని అమ్ముకుంటూ వెళ్లిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మరీ దారుణం రూ. 10 వేలకు ఆశపడి కూడా కన్న కూతుర్ని అమ్ముకుంటున్న ఘటనలను చూస్తే.. కన్నీళ్లు రాకుండా ఉండవు. మరో ఘటనలో ఆడ శిశువు కడుపులో ఉండగానే ఓ మూర్ఖపు తల్లిదండ్రులు రూ. 4 లక్షలకు బేరమాడారు.
ఇక ఇలాంటి విషయాలకు వారు చెప్పే సాకు ఏంటంటే.. “పేదరికం లో మగ్గుతున్నాం.. అందుకే ఆడపిల్లలను అమ్ముకుంటున్నాం..” అని. మరీ అంత పేదరికం ఉన్నప్పుడు పిల్లలను కనడం దేనికి? ఇంకా నీచం ఏంటంటే.. వెబ్ సైట్లు పెట్టి మరీ పిల్లలను అమ్మేసుడు.
కొందరు పరువు మర్యాదలను మగ పిల్లలే నిలబెడుతారు అని నమ్మితే.. మరికొందరు కొండంత ధైర్యం నింపేందుకు కొడుకులు కావాలని అంటారు. ఇంకొందరు బయటి వారి పోరు భరించలేక మగ పిల్లలే కావాలంటారు. ఇలా కారణాలు ఏమైతేనేమీ..? ఇక్కడ అన్యాయం కేవలం ఆడ పిల్లలకే జరుగుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి సచ్చేదాక వాళ్లు యుద్ధం చేస్తునే ఉండాలి.

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంటారు కదా! మన దేశంలో స్రీలకు పూజ కాదు కదా! బతికే స్వేచ్ఛ కూడా లేదు. కానీ దేవతలు మాత్రం కొలువై ఉన్నారు. పూజలు అందుకుంటున్నారు. ఆ దేవతలు కొలువైన ఆలయాల్లోకి పోవాలన్న ఈ దేశంలో ఎన్నో కట్టుబాట్లు అడ్డొస్తాయి.
ఇలా ఆడపిల్ల అని పుట్టకముందే తెలిస్తే కడుపులోనే కడతేర్చుతరు. లేదంటే ఫైసలకు బేరం పెడుతరు. అదీ కాదంటే పుట్టిన వెంటనే నోట్ల వడ్ల గింజ వేసి పాణం తీస్తరు. ఇగ ఎట్లా మన దేశంలో ఆడ పిల్లలు బతికేది? ఆడబిడ్డ ఎట్ల లోకాన్ని ఏలేది?
ఇకనైనా మారండి.. పేదరికంలో కొట్టుకుంటున్న మీ ఆలోచనలకు పుల్ స్టాప్ పెట్టండి. ఆడపిల్ల పుడితే పండుగ చేసుకోండి. లోకానికి తానొక ఆదర్శంగా మారేందుకు మీ చేయుతను అందించండి. అమ్మ, అక్క, చెల్లి, భార్య అనే బంధాలు ముందు తరాలకు అందించాలంటే.. అమ్మాయిలే కావాలని గుర్తించండి.

శివలీల రాజమోని,
జర్నలిస్ట్,
రంగారెడ్డి.
rajamonishivaleela@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
ఏందే అన్నా.. ఎట్లున్నా కష్టమేనా ?
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?