దర్వాజ-హైదరాబాద్
US Russia India trade impact: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై సుంకాలు విధిస్తే భారత్‌పై వాటి ప్రభావం, చమురు, ఆయుధ, ఎగుమతులపై ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందో ఙప్పుడు తెలుసుకుందాం.
అమెరికా రష్యాపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తే, భారత ఆర్థిక రంగాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముంది. చమురు, ఆయుధ, ఎగుమతులపై దెబ్బ తగలొచ్చు.
అమెరికా సుంకాల ఉద్దేశం ఏమిటి?
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా ఆగడాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. “ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపకపోతే, రష్యాపై 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సుంకాలు రష్యాతో మాత్రమే కాక, దానితో వ్యాపారం చేసే దేశాలపై కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీనిని ‘సెకండరీ టారిఫ్’గా పిలుస్తున్నారు. అంటే, మితృదేశాలను రష్యాకు దూరం చేయడం కోసం పన్నులు వేయడం.

భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం ఎలా ఉంటుంది?
భారతదేశం రష్యాతో చారిత్రకంగా బలమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. ముఖ్యంగా చమురు, ఆయుధ దిగుమతులలో భారత్ రష్యాపై అధికంగా ఆధారపడుతోంది. ట్రంప్ నిర్ణయం అమలవుతే, భారతదేశం దిగుమతి చేస్తున్న చమురు, రక్షణ పరికరాలపై అమెరికాలో అధిక పన్ను విధించే అవకాశం ఉంది. ఇది రెండు విధాల ప్రభావం చూపుతుంది:
👉 భారత్-రష్యా మధ్య వాణిజ్య ఒప్పందాలు తగ్గిపోవచ్చు.
👉 అమెరికాలో భారత్ ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల వాటి పోటీ సామర్థ్యం తగ్గుతుంది.
చమురు రంగంపై ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది?
2024-25లో భారత్ రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం అవసరాల్లో సుమారు 35 శాతం. రష్యా చమురు తక్కువ ధరలకు అందుబాటులో ఉండటం వల్ల భారత చమురు శుద్ధి కేంద్రాలు లాభపడుతున్నాయి. ఇక ట్రంప్ సుంకాల వల్ల ఈ దిగుమతులపై ఆంక్షలు వస్తే, భారత్‌కు చమురు వినియోగంలో నష్టాలు తప్పవు. అంతేకాక, శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రభావం పడుతుంది.
ఆయుధ రంగంపై ప్రభావం ఎలా ఉంటుంది?
భారత్, రష్యా మధ్య రక్షణ రంగంలో సహకారం గణనీయంగా ఉంది. గత 20 ఏళ్లలో భారత్ సుమారు 60 బిలియన్ డాలర్ల ఆయుధాలు దిగుమతి చేసుకుంది, అందులో 65 శాతం రష్యా నుండి ఉన్నాయి. కానీ ట్రంప్ సుంకాల వల్ల రక్షణ లావాదేవీల్లో జాప్యం ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా, ట్యాంకులు, ఫైటర్ జెట్లు, ఎస్-400 క్షిపణి వ్యవస్థలు వంటి ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి.

ఇతర దేశాలు, ప్రాంతాలపై ప్రభావం?
ట్రంప్ విధించే సెకండరీ టారిఫ్ వల్ల ఇతర దేశాలపై ప్రభావం ఇలా ఉండొచ్చు:
యూఏఈ: రష్యన్ కరెన్సీ మారకాల్లో కీలక హబ్. యుఎస్ ఆంక్షలు ఆర్థికంగా బలహీనత తెస్తాయి.
టర్కీ: నాటో సభ్యమైనప్పటికీ రష్యాతో బంధం ఉంది. ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ప్రభావం.
బ్రెజిల్: రష్యా ఎరువులపై ఆధారపడే వ్యవసాయ దేశం. పన్నుల వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గొచ్చు.
వియత్నాం, థాయ్‌లాండ్: రష్యాతో రక్షణ, ఇంధన ఒప్పందాలు కలిగిన దేశాలు కావడంతో అమెరికా దాడులు వీరిపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చు.
మొత్తంగా ట్రంప్ సుంకాల నిర్ణయం అమలవుతే, అది భారతదేశంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా చమురు, రక్షణ, వ్యవసాయ రంగాలు దెబ్బతింటాయి. భారత్ వంటి దేశాలు తమ వ్యూహాలను తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అమెరికా కొత్త ఆర్థిక దాడికి సిద్ధమవుతుంటే, అది ప్రపంచ వాణిజ్య పటాన్ని మళ్లీ మార్చే అవకాశముంది.
