Kalki 2898 AD: ప్ర‌భాస్ ‘క‌ల్కీ’ని భ‌య‌పెడుతున్న పైర‌సీ భూతం..

దర్వాజ-సినిమా

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్ర‌ముఖ‌ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ఎట్టకేలకు జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. ఫస్ట్ డే స్క్రీనింగ్స్ కు మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు, క్రిటిక్స్ కొనియాడుతున్నారు. ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ, సినిమా విడుదలైన 24 గంటల్లోనే పైరసీ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడంతో పైరసీ ఆందోళనలు మొద‌లైంది. ఈ అక్రమ చర్యల‌పై చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తోంది.

పైరసీకి పాల్పడొద్దని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ‘కల్కి’ని వెండితెరపైకి తీసుకురావడానికి నాగ్ అశ్విన్, చిత్రబృందం నాలుగేళ్లుగా చేసిన అపారమైన కృషి, అంకితభావాన్ని ప్ర‌స్తావించింది. ఈ చిత్రం కోసం వారు ప‌డిన కష్టం, చేసిన త్యాగాలను, అత్యున్నత సినీ అనుభవాన్ని అందించాలనే అచంచల నిబద్ధతను నొక్కి చెప్పింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ లో పడిన చెమటను, శ్రమను ప్రతిబింబించేలా ‘కల్కి’ చిత్రాన్ని రూపొందించామని నిర్మాతలు తెలిపారు. పైరసీ కంటెంట్ కు మద్దతు ఇవ్వకుండా, వ్యాప్తి చేయకుండా చిత్రనిర్మాణంలో ఉన్న కళాత్మకతను, కళానైపుణ్యాన్ని గౌరవించాలని వారు అభిమానులను కోరారు.

ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత మొద‌టి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ రావ‌డంతో చిత్ర యూనిట్ సిబ్బంది సంతోషం వ్య‌క్తంచేస్తోంది. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్ లతో పాటు దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ‘కల్కి 2898 ఏడీ’లో ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో ఈ చిత్రం మరింత మధురానుభూతిని సంతరించుకుంది.

Related Post