దర్వాజ-భూవనేశ్వర్
lightning strikes: ఒడిశాలో విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వరుసగా రెండు గంటల పాటు 61 వేల పిడుగులు పడటంతో 12 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 7 వరకు రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వివరాల్లోకెళ్తే.. ఒడిశాలో 2 గంటల్లో 62,350 పిడుగులు పడగా, భువనేశ్వర్‌లో 12 మంది మరణించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. 36,597 క్లౌడ్-టు-క్లౌడ్ మెరుపు దాడులు, 25,753 పిడుగులు భూమిపైకి వచ్చాయి. శనివారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు పడ్డాయి. 11 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఖుర్దా జిల్లాలో నలుగురు, బోహంగీర్ జిల్లాలో ఇద్దరు, అంగుల్, బౌధ్, గజపతి, జగత్‌సింగ్‌పూర్, దెంకనల్, పూరీలలో పిడుగుపాటుకు ఒక్కొక్కరు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.4 లక్షల సాయం ప్రకటించింది. పిడుగుపాటుకు 8 ఆవులు మృతి చెందాయి. గంటన్నర వ్యవధిలో భువనేశ్వర్‌లో 126, కటక్‌లో 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.. పిడుగుపాటును రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన ఒడిశాలో గతేడాది పిడుగుల కారణంగా 281 మంది మరణించారు.