చెస్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రాండ్ మాస్ట‌ర్

Bangladesh, Chess, Grandmaster, Ziaur Rahman
Ziaur Rahman (📸: X/@ChessbaseIndia)

ద‌ర్వాజ‌-క్రీడ‌లు

Grandmaster Ziaur Rahman : చెస్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు ఒక గ్రాండ్ మాస్ట‌ర్. ఈ షాకింగ్ ఘ‌ట‌న జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్ స‌మ‌యంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న సమయంలో బంగ్లాదేశ్ గ్రాండ్‌మాస్టర్ జియావుర్ రెహ్మాన్ గుండెపోటుతో శుక్రవారం ఢాకాలో కన్నుమూశారు. బంగ్లాదేశ్ చెస్ ఫెడరేషన్ ఆయ‌న మరణాన్ని ధృవీకరించింది. ప్ర‌స్తుతం ఆయ‌నకు 50 ఏళ్లు. జియావుర్ రెహ్మాన్ 15 సార్లు బంగ్లాదేశ్ చెస్ ఛాంపియన్ గా నిలిచారు. గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అనేక టోర్నమెంట్లలో కూడా ఆడారు. భార‌త్ లో కూడా ఆయ‌న అనేక టోర్న‌మెంట్ ల‌లో పొల్గొన్నారు.

శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇనాముల్ హుస్సేన్ రాజీబ్‌తో జరిగిన 12వ రౌండ్ గేమ్‌లో రెహ్మాన్ ఆడుతూ నేలపై కుప్పకూలిపోయాడు. అతన్ని ఢాకాలోని ఇబ్రహీం కార్డియాక్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, రెహమాన్ కుమారుడు తహ్సిన్ తజ్వర్ జియా కూడా అదే టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. సంఘటన జరిగినప్పుడు హాలులో ఉన్నాడ‌ని స‌మాచారం.

రెహమాన్ బంగ్లాదేశ్‌లో అత్యధికంగా గుర్తింపు ఉన్న‌ చెస్ ఆటగాడు. 1993లో అత‌ను అంతర్జాతీయ మాస్టర్ టైటిల్‌, 2002లో గ్రాండ్ మాస్ట‌ర్ టైటిల్‌ను సంపాదించాడు. అతను చెస్ ఒలింపియాడ్‌లో బంగ్లాదేశ్ తరపున 17 సార్లు పోటీ పడ్డాడు. 2022లో చెన్నైలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్‌లో కుమారుడు తహ్సిన్ తజ్వర్ జియాతో క‌లిసి రికార్డు సృష్టించాడు. ఈ జోడీ జాతీయ చెస్ జట్టులో చేరిన మొదటి తండ్రీకొడుకులు కావ‌డం విశేషం. 2005లో అతను 2570 రేటింగ్‌ను సాధించాడు, ఇది ఇప్పటికీ బంగ్లాదేశ్ చెస్ ఆటగాడి ఒక రికార్డు. 2008లో యంగ్ గ్రాండ్ మాస్ట‌ర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను (అప్పట్లో 2786 రేట్) డ్రా చేసిన స‌మ‌యంలో కూడా ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు.

Related Post