దర్వాజ- గాంధీనగర్
Bhagavad Gita : 2022-23 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 6 నుండి 12 తరగతులకు భగవద్గీత పాఠశాల సిలబస్‌లో భాగంగా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రకటించింది. విద్యా శాఖకు బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా విద్యాశాఖ మంత్రి జితు వాఘాని శాసనసభలో ఈ విషయాన్ని ప్రకటించారు.
“పాఠశాల పాఠ్యాంశాల్లో భగవద్గీతలో పొందుపరిచిన విలువలు మరియు సూత్రాలను ప్రవేశపెట్టాలనే నిర్ణయం కేంద్రం ఆవిష్కరించిన కొత్త జాతీయ విద్యా విధానం (NEP)కి అనుగుణంగా ఉంది. ఇది ఆధునిక మరియు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు మరియు జ్ఞాన వ్యవస్థలను ప్రవేశపెట్టాలని సూచించింది. భారతదేశ గొప్ప వైవిధ్యమైన సంస్కృతిని చూసి విద్యార్థులు గర్వపడుతున్నారని” మంత్రి అన్నారు.
అలాగే, మీడియాతో వాఘాని మాట్లాడుతూ.. ప్రాచీన హిందూ గ్రంధంలో పేర్కొన్న నైతిక విలువలు, సూత్రాలను అన్ని మతాల ప్రజలు అంగీకరించారన్నారు. “అందుకే, 6 నుండి 12 తరగతులకు పాఠశాల పాఠ్యాంశాల్లో భగవద్గీతను ప్రవేశపెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. 6- 8 తరగతుల విద్యార్థులకు, ఈ గ్రంథాన్ని ‘సర్వాంగి శిక్షన్’ (సంపూర్ణ విద్య) పాఠ్యపుస్తకంలో ప్రవేశపెడతారు. 9-12వ తరగతి వరకు ప్రథమ భాష పాఠ్యపుస్తకంలో కథాకథనాల రూపంలో ప్రవేశపెడతాం’’ అని తెలిపారు.
పాఠశాలల్లో ప్రార్థనలు, శ్లోక పఠనం, కాంప్రహెన్షన్, డ్రామా, క్విజ్, పెయింటింగ్, వక్తృత్వ పోటీలు వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. పుస్తకాలు, ఆడియో-వీడియో సీడీల వంటి స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వం పాఠశాలలకు అందజేస్తుందని మంత్రి తెలిపారు.