- బీజేవైఎం మండల అధ్యక్షులు అంబటి శ్రీశైలం
దర్వాజ-కొత్తూర్
నిరుద్యోగులు అండగా బీజేవైఎం ఉంటుందని.. నియామకాల విషయం లో రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనీ బీజేవైఎం మండల అధ్యక్షులు అంబటి శ్రీశైలం అన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ..
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలని పట్టించుకోవడంలేదని.. గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని అన్నారు. ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ యువత తరపున, నిరుద్యోగుల తరపున బీజేవైఎం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉందని తెలిపారు.

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని ,గ్రూప్ – 2, గ్రూప్ – 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించి, ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను నిలిపివేసి నూతన తేదీలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి, పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలన్నారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు బీజేపీ మండలం అధ్యక్షులు మంగలి రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షులు నాగరాజ్ చారి మరియు మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం బీజేవైఎం నాయకులు రణధీర్ గౌడ్, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ ప్రశాంత్ శివ, గణేష్, బిజెపి సీనియర్ నాయకులు భావన్ల మాణిక్యం, గణేష్ దాసరి, శ్రీశైలం, మల్లేష్, బిజెపి జనరల్ సెక్రెటరీ కుమార్ మరియు కొత్తూరు మండల బీజేపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..