దర్వాజ-భోపాల్
Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఖల్‌ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు నర్మదా నదిలో పడిపోయింది. ఉదయం 10.45 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సులో మహిళలు, పిల్లలు సహా 50 మందికి పైగా ఉన్నారు. ఇప్పటి వరకు నదిలో నుంచి 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. కాగా 15 మందిని రక్షించారు. అదే సమయంలో 25-27 మంది గల్లంతైనట్లు సమాచారం. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్రేన్ ద్వారా బస్సును బయటకు తీశారు. ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టకుండా వాహనాన్ని కాపాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి రెయిలింగ్ విరిగి 25 అడుగుల దిగువన ఉన్న నదిలో బస్సు నేరుగా పడిపోయింది. ఖల్‌ఘాట్‌లోని పాత వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండోర్ నుండి మహారాష్ట్ర వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ఖల్ఘాట్ సంజయ్ సేతు వంతెనపై బ్యాలెన్స్ తప్పి 25 అడుగుల దిగువన నర్మదా నదిలో పడిపోయింది. ధమ్నోద్ పోలీసులు, ఖల్తాకా పోలీసులు, డైవర్లు బాధితులను రక్షించే చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. అధికారులను ఘటనాస్థలికి చేరుకోవాలని ఆదేశించారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. ప్రయాణికులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఘటనా స్థలంలో ఉంది. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ను పంపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.
ధార్ జిల్లా ఖల్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం కమల్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలకు వీలైనంత త్వరగా ఆదుకోవాలని ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
Share this content: