దర్వాజ – గుంటూరు
Case Registered Against ys Jagan: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్నాడు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న సింగాయ్య మృతి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పోలీసుాధికారి (ఎస్పీ) సతీష్ కుమార్ ఆదివారం రాత్రి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి నిందితుడిగా చేర్చినట్టు ఆయన తెలిపారు.
ఈ ఘటన జూన్ 18న గుంటూరులోని ఏటుకూరు రోడ్ బైపాస్ వద్ద చోటుచేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. పల్నాడు పర్యటనలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ అక్కడ నుండి ప్రయాణిస్తోంది. అదే సమయంలో రోడ్డుపక్కన తీవ్రంగా గాయపడిన వృద్ధుడు సింగయ్య కనిపించగా, ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సింగయ్య భార్య ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా కేసు నమోదు చేశారు.
అనంతరం ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లు, డ్రోన్ కెమెరా దృశ్యాలు, ప్రయాణికులు తీసిన వీడియోల ఆధారంగా లోతుగా విచారణ చేపట్టినట్టు ఎస్పీ చెప్పారు. అందులో ఒక వీడియోలో, ఫార్ట్యూనర్ వాహనం కింద సింగయ్య పడిపోవడం, టైరు అతనిపై నుంచి వెళ్లిన దృశ్యం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఈ ఆధారాల ప్రకారం, కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 105 (అశ్రద్ధ వల్ల మరణానికి కారణమవడం), 49ల కింద కేసు మళ్లీ నమోదు చేసినట్టు వెల్లడించారు.
ఈ కేసులో కేవలం వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డినే కాకుండా, జగన్ మోహన్ రెడ్డి, కాన్వాయ్‌లో ఉన్న నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రాజిని నిందితులుగా చేర్చినట్టు తెలిపారు.
‘‘జగన్ కాన్వాయ్‌కు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చాం. కానీ తాడేపల్లి నుండి ప్రారంభమైన కాన్వాయ్‌లో 50 వాహనాల వరకు ఉన్నట్టు నమోదు అయ్యింది’’ అని ఎస్పీ స్పష్టం చేశారు. కేసు ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగుతుందని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ ఘటన జూన్ 18న సత్తెనపల్లి నియోజకవర్గంలో విగ్రహావిష్కరణకు వెళ్లే దారిలో జరిగినట్టు ఎస్పీ వివరించారు. మొదట్లో వచ్చిన సమాచారం ప్రకారం వేరే ప్రైవేట్ వాహనం వల్ల ఈ ఘటన జరిగిందని అనుకున్నామని, కానీ తత్కాలానికి జరిగిన లోతైన దర్యాప్తులో కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. కేసుపై పూర్తి స్వతంత్ర విచారణ జరుపుతున్నామని, చట్టం ప్రకారం తుదినిర్ణయం తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
