సుప్రీంకోర్టులో స‌వాల్.. ఈడీ నోటీసుల‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

BRS leader Kalvakuntla Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసు రాజకీయ ప్రేరేపితమనీ, దీనిపై భవిష్యత్ కార్యాచరణను పార్టీ లీగల్ టీం నిర్ణయిస్తుందని అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ క్ర‌మంలోనే ఈడీ నోటీసులను కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు జారీ చేసిన నోటీసును ప్రధాని నరేంద్ర మోడీ తరఫున పంపిన టీవీ సీరియల్ పొడిగింపుగా, రాజకీయ కక్ష సాధింపు చర్యగా భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. దీని గురించి పెద్దగా చదవడానికి ఏమీ లేదనీ, తమ లీగల్ టీం ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. గత ఏడాది కాలంగా ఈ నోటీసుల ప‌ర్వం టీవీ సీరియల్ లా నడుస్తోందనీ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరో ఎపిసోడ్ ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఎక్సైజ్ కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తెకు ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఢిల్లీ కార్యాలయానికి సమన్లు జారీ చేసింది. మార్చిలో ఈడీ ప్రధాన కార్యాలయంలో కవితను పలుమార్లు విచారించగా దర్యాప్తు కోసం ఆమె మొబైల్ ఫోన్లను ఫెడరల్ ఏజెన్సీకి సమర్పించాల్సి వచ్చింది. ఈడీ నోటీసును ‘మోడీ నోటీసు’గా అభివర్ణించిన బీఆర్ఎస్ నేత, రాజకీయ కక్షసాధింపుతో పంపినందున దీనిపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ నోటీసుపై కవిత నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో స్పందిస్తూ.. ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర సంస్థలను ఉపయోగించడం బీజేపీ పద్దతి అనీ, తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నందున ఇక్కడ కూడా అదే టెక్నిక్ ను ఉపయోగిస్తున్నారని అన్నారు.

‘నాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. పార్టీ లీగల్ సెల్ కు ఇచ్చాం. వారి సలహా మేరకు నడుచుకుంటాం. తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం – రాబోయే ఎన్నికల కారణంగా ఇది రాజకీయ ప్రేరేపితమని తాము బలంగా విశ్వసిస్తున్నాం’ అని ఆమె విలేకరులతో అన్నారు. ఈడీ దర్యాప్తును ఆమె ‘ఎప్పటికీ ముగియని టీవీ సీరియల్’తో పోల్చారు. ‘దురదృష్టవశాత్తూ గత ఏడాది కాలంగా దర్యాప్తు జరుగుతోంది. ఎన్నాళ్లు జరుగుతుందో తెలియదు. 2జీ (స్కామ్) కూడా ఇంతకాలం సాగిందని నేను అనుకోవడం లేదు. ఇది దురదృష్టకరం, అయితే ఇది రాజకీయ ప్రేరేపిత, క‌క్ష్య సాధింపు చ‌ర్య’ అని కవిత అన్నారు. ఎన్నిక‌ల క్ర‌మంలో జ‌రుగుతున్న ఈ కుట్ర‌ను తెలంగాణ ప్రజలు సీరియస్ గా తీసుకోరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ-టీమ్ కాదనీ, ఈ దేశ, తెలంగాణ ప్రజల ఏ-టీమ్ అనీ, బీజేపీ ఈ తరహా ఆపరేషన్ ద్వారా ప్రజలు చూసి ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు.

కాగా, మద్యం వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కార్టలైజేషన్ ను అనుమతించిందని, దాని కోసం లంచాలు ఇచ్చిన కొంతమంది డీలర్లకు అనుకూలంగా ఉందని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఆరోపణను దేశ రాజధానిలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రంగా ఖండించింది. ఆ తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేయడంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. కవితతో సంబంధం ఉన్న అకౌంటెంట్ బుచ్చిబాబు వాంగ్మూలాన్ని ఈడీ తన దర్యాప్తులో నమోదు చేసింది. తాను ఏ తప్పూ చేయలేదని, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈడీని వాడుకుంటోందనీ, కాషాయ పార్టీ తెలంగాణలో బ్యాక్ డోర్ ఎంట్రీ పొందలేకపోయిందని కవిత ఆరోపించారు.

Related Post