దర్వాజ-విజయవాడ
Vijayawada-Chennai Vande Bharat Express: ఈ నెల 24న విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. విజయవాడ రైల్వేస్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానుండగా, ప్రధాని వర్చువల్ గా ఈ సేవలను ప్రారంభించనున్నారు.
వివరాల్లోకెళ్తే.. విజయవాడ-చెన్నై వందే భారత్ రైలును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు బుధవారం తెలిపారు.
ఈ రైలు పరిమిత హాల్ట్‌లతో ఆరు గంటల 40 నిమిషాల్లో చెన్నై చేరుకుంటుంది. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారతీయ రైల్వే అధికారులు ఈ వేడుకకు విచ్చేయనున్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రీమియర్ రైలు ప్రారంభం సందర్భంగా ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (పిఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ప్రారంభానికి రైల్వే అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.