దర్వాజ-న్యూఢిల్లీ
దేశంలో కరోనా సునామీ మొదలైంది. తీవ్ర స్థాయిలో వైరస్ పంజా విసురుతోంది. దీంతో ఏ దేశంలోనూ నమోదుకాని రీతిలో భారత్‌లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది వరకు నిత్యం రెండు లక్షల కేసులు నమోదవుతుండగా.. అవి మూడు లక్షలకు చేరువగా పరుగులు తీస్తున్నాయి. మరణాలు సైతం ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,95,041 మందికి కరోనా సోకింది. ఈ స్థాయిలో ఒకే రోజులు కేసులు మరేదేశంలోనూ వెలుగుచూడలేదు. ఇదే సమయంలో కరోనాతో పోరాడుతూ 2,023 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,82,553కు పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది.
అలాగే, కొత్తగా 1,67,457 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 1,32,76,039కి చేరింది. ప్రస్తుతం 21,57,538 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరందరూ కూడా దేశంలోని వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 13,01,19,310 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 30 లక్షల మందికి టీకాలు వేశారు. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 27,10,53,392 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 16,39,357 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.