దర్వాజ-హైదరాబాద్
Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గుడ్ న్యూస్ చెప్పారు. వారి క్రమబద్ధీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును అంచనా వేసేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలనీ, క్రమబద్ధీకరణకు సంబంధించి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు.
జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా అటవీ అధికారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ లేదా డీసీపీ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రస్థాయి నుంచి కార్యదర్శి స్థాయి లేదా హెచ్ వోడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి కమిటీ జిల్లా స్థాయి కమిటీల ప్రతిపాదనలను సమీక్షించి అవసరమైన చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తన సిఫార్సులను సమర్పిస్తుంది.
సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కొన్ని గ్రామ పంచాయతీల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సంబంధిత జిల్లా కలెక్టర్లు తాత్కాలిక ప్రాతిపదికన నియమించారని తెలిపారు. సర్వీసులో ఉన్న వారి రెగ్యులరైజేషన్ పూర్తయిన తర్వాత కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.