దర్వాజ-బెంగళూరు
Karnataka: కర్నాటకలో దారుణ పరువు హత్య చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. వివరాల్లోకెళ్తే.. వేరువేరు మతాలకు చెందిన ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవాలనుకుంది. కానీ పెద్దలు నో చెప్పారు. ఈ క్రమంలోనే దళిత యువకుడు దారుణంగా పరువు హత్యకు గురయ్యాడని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. ఈ ఘటన కర్నాటకలోని కలబురిగిలో చోటుచేసుకుంది.
ముస్లిం మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంగా 25 ఏళ్ల దళిత యువకుడిని హత్య చేయడం కర్నాటకలో కలకలం రేపింది. దీంతో జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పెంచారు. వాడి పట్టణంలోని భీమా నగర్ లేఅవుట్‌లో నివాసముంటున్న విజయ్ కాంబ్లేను సోమవారం రాత్రి రైల్వే బ్రిడ్జి దగ్గర కొందరు వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. దుండగులు అతనిపై పదునైన ఆయుధాలతో చేయడంతో విజయ కాంబ్లీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి మృతుడి స్నేహితుడు మీడియాతో మాట్లాడుతూ.. “మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా కనిపించారు. వారు ఎవరో మాకు తెలియదు. వారు అతనిపై దాడి చేశారు. ఒకరు మారణాయుధంతో అతనిని నరికి చంపారు. అనంతరం అక్కడి నుండి పారిపోయారు” అని చెప్పాడు.
విజయ్ కాంబ్లే.. ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అయితే ఆమె కుటుంబ సభ్యులు వారి సంబంధాన్ని వ్యతిరేకించారని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి తల్లి ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో బాలిక తండ్రి, సోదరుడు తన కుమారుడిని కత్తితో పొడిచి చంపారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. “ఆమె సోదరుడు మరో ఇద్దరితో కలిసి ఇంటికి వచ్చి మమ్మల్ని హెచ్చరించాడు. అతను మా కొడుకుతో.. ‘అమ్మాయితో సంబంధాన్ని ముగించుకో’ అని మమ్మల్ని హెచ్చరించాడు. నా కొడుకుకు హాని చేయవద్దని మేము వారిని అభ్యర్థించాము .. నా కొడుకు అమ్మాయితో కలవకుండా చూసుకున్నాము. కానీ చివరకు ఇలా చంపేశారు” అని మృతుడి కుటుంబం కన్నీరు పెట్టుకుంది.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను 19 ఏళ్ల షహబుద్దీన్, మహిళ సోదరుడు19 ఏళ్ల నవాజ్ గా గుర్తించారు.
Share this content: