తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ పండుగ రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు- మొత్తం ఆరు రుచుల కలయికతో కూడిన అమృత పానీయం ఇది. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే మంచిచెడులకు, కష్టసుఖా లకు, జయాపజయాలకు నిదర్శనం. అంటే జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను యథాతథంగా తీసుకోవాలని చెబుతోంది.
ఉగాది పచ్చడి గురించి మన పురాణాల్లో పలు చోట్ల వివరించారు. దీనిని ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోక కళికా ప్రాశనం’ అనీ, దీనిని తీసుకోవడం వల్ల రుతువుల మార్పు కారణంగా కలిగే అనేక దోషాలు దూరమవుతాయని వాటిల్లో వివరించారు. ఈ ఉగాది పచ్చడికి తయారు చేసే షడ్రుచులు కలిగిన ఈ పదర్థాలు అనేక ఔషధ గుణాలు సైతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం..

బెల్లం : తీపిని కలిగించేది. ఆనందానికి గుర్తు. ఇది మనసును ఆహ్లాద పరుస్తుంది. బెల్లంలో మినరల్స్, విటమిన్స్, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత రాకుండా కాపాడుతుంది.
చింతపండు : పులుపుగా ఉంటుంది. ఇది నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు గుర్తు చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి.
ఉప్పు : రుచిని కలిగించే పదార్థం. ఇది జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. దీని వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి.
కారం : సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు తెలియజేస్తుంది. ఇక కారంలో ఉండే ఫైబర్స్, మినరల్స్, విటమిన్స్ వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది.
వేప పువ్వు : చేదును కలిగించేది. జీవితంలో బాధకలిగించే అనుభవాలకు గుర్తు చేసేది. వేపపువ్వు వల్ల పొట్టలో ఉండే హానికర క్రిములను చంపడంతో పాటు చర్మ వ్యాధులు రానీయదు. రక్తశుద్ధికి తోడ్పడుతుంది.
మామిడి : లేత పచ్చి మామిడి వగరుగా ఉంటుంది. ఇది జీవితంలో వచ్చే కొత్త సవాళ్లును ఎదుర్కొవాలని సూచిస్తుంది. మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పేగుల్లోని మలినాల్ని బయటకు పంపుతుంది. రక్త విరేచనాలను అరికడుతుంది.

ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలంటే..
కావలసిన పదార్థాలు – తగిన మోతాదులో తీసుకోవాలి.
1. వేప పువ్వు
2. చింతపండు
3. బెల్లం
4. పచ్చి మామిడి
5. ఉప్పు
6. కారం (లేదా పచ్చిమిర్చి)
7. శెనగపప్పు
8. తాజా కొబ్బరి తురుము
తయారు చేసుకోవడం ఇలా….
చింతపండు గుజ్జు, బెల్లం తురుము, మామిడి ముక్కలు, కొబ్బరి తురుము, వేపపువ్వు, శెనగపప్పు, ఉప్పు, కారం లేదా పచ్చిమిర్చిలను ఒక గిన్నెలో వేసి కలపాలి. ఉగాది పచ్చడి రెడీ ..!
భవిష్యత్తుపై సన్నగిల్లిన విశ్వాసం !
లింగ సమానత్వం ఇప్పట్లో జరగనట్టే !
తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటా !