దర్వాజ-హైదరాబాద్
Hyderabad: ప్రపంచవ్యాప్తగా పలు నగరాల్లో కాలుష్యం రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ప్రపంచంలోని 100 అత్యంత కాలుష్య నగరాల్లో 60 పైగా భారత్ లోనే ఉండటం దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది స్పష్టం చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 2021లో హైదరాబాద్‌లో కాలుష్య స్థాయి పెరిగింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
స్విట్జర్లాండ్‌కు చెందిన IQAir విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం, పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) స్థాయిలు 2020లో 34.7 నుండి 2021లో 39.4కి పెరిగాయి. డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయి కనిపించింది.
హైదరాబాద్‌లో నెలవారీగా పీఎం స్థాయిలు ఇలా ఉన్నాయి..
నెల (2021) | PM 2.5 స్థాయిలు |
జనవరి | 64.6 |
ఫిబ్రవరి | 63 |
మార్చి | 56.4 |
ఏప్రిల్ | 46.9 |
మే | 23.6 |
జూన్ | 16.9 |
జూలై | 12 |
ఆగస్టు | 16.7 |
సెప్టెంబర్ | 13.6 |
అక్టోబర్ | 46.7 |
నవంబర్ | 45.5 |
డిసెంబర్ | 68.4 |
భారతదేశంలోని ఆరు అత్యంత కాలుష్య నగరాల జాబితాను గమనిస్తే.. దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. 2020లో 84.1 నుండి 2021లో 96.4కి నగరం పర్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలు పెరిగాయి. ఢిల్లీ తర్వాత కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాలుగా..కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు ఉన్నాయి. భారతదేశంలోని ఏ నగరం కూడా 5 µg/m3 WHO గాలి నాణ్యత మార్గదర్శకాలను అందుకోలేకపోయింది.
కాలుష్య స్థాయి పెరగడానికి కారణాలు..
స్విట్జర్లాండ్‌కు చెందిన IQAir విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం.. మోటారు వాహనాల్లోని అంతర్గత దహన యంత్రాల వల్ల 20-35 శాతం పార్టికల్ మ్యాటర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నదని తెలిపింది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో వాహనాల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఇది కాలుష్య స్థాయి పెరుగుదలకు దారి తీస్తుందని తెలిపింది. హైదరాబాద్‌లోని మొత్తం వాహన జనాభాలో 90 శాతం వ్యక్తిగత వాహనాలేనని తాజా నివేదిక వెల్లడించింది. నగరంలో మొత్తం 60 లక్షల వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి.
Share this content: