దర్వాజ-న్యూఢిల్లీ
India COVID-19 Updates: దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిఘా పెంచాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. భారత్ లో ఒక్కరోజే 8 వేలకు చేరువగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 40,215కు పెరిగాయి.
వివరాల్లోకెళ్తే.. దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 7,830 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసుల పెరుగుదలతో భారతదేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు పెరిగింది. ఈ స్థాయిలో కోవిడ్ రోజువారి కొత్త కేసులు నమోదుకావడం గత 223 రోజుల్లో (ఏడు నెలలు) అత్యధికం. రోజువారీ పాజిటివిటీ రేటు 3.65శాతంగా ఉంది. వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 3.83 శాతంగా ఉంది.
దేశంలో కోవిడ్ మరణాలు సైతం పెరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఇద్దరు చొప్పున, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లలో ఒక్కొక్కరు చొప్పున, కేరళలో ఐదుగురు చొప్పున మొత్తం 16 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,31,016కు పెరిగింది. దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,76,002) గా నమోదైంది.
గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒక్కరోజే 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఉప్పుడు భారీగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.09 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,04,771కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ పేర్కొంది. కోవిడ్ కేసులు పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాలు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి.